-పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాల కల్పనతో నిబంధనల మేరకు చర్యలు చేపడుతున్నాం : మునిసిపల్ కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సఫాయి కర్మచారిలకు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సఫాయి కరంచారి కమిషన్ చైర్మన్ ఎం.వెంకటేశన్ అన్నారు. శనివారం తిరుపతి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో సఫాయి కరంచారిల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సఫాయి కరంచారి చైర్మన్ వెంకటేశన్ మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు ఏమేరకు చెల్లిస్తున్నారు. ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రతినెల సరైన సమయంలో జీతాలు ఇచ్చేలా చూడాలన్నారు.. పీఎఫ్, ఈ ఎస్ ఐ వంటి వాటి గురించి కార్మికులు అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. తరచూ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. లీడ్ బ్యాంకర్లతో చర్చించి ఎటువంటి పూచీకత్తు లేకుండా కార్మికులకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కమిషనర్ ను కలసి తెలపాలని, లేకుంటే తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చైర్మన్ అన్నారు.
కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ అన్ని సౌకర్యాలు చట్టబద్ధంగా కల్పిస్తున్నామని అందులో ఎటువంటి అలసత్వం లేదని, మాస్టర్ గదులు తక్కువగా ఉన్నాయని, స్థల పరిశీలన చేసి త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మహిళా అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్మికులకు కావాల్సిన యూనిఫాం, చెప్పులు, రక్షణ కవచాలు అందిస్తున్నామని చెప్పారు. విధుల్లో పాటించాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పిస్తూ, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, తుడా కార్యదర్శి వెంకట నారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, తుడా సెక్రటరీ రాధిక, మేనేజర్ హసీమ్, శానిటరీ సూపర్ వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.