గ్రామీణ ప్రజల సాధికారత, స్వావలంబన, సుపరిపాలన నా ఆకాంక్ష: ఉపరాష్ట్రపతి

– సేంద్రియ పద్ధతులపై, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి జరగాలి
-వ్యవసాయ ఎగుమతులు ఈ ఏడాది 18 శాతం మేర పెరగడం అభినందనీయం
-నీటి ఎద్దడిని తట్టుకునే పంటలపై మరింత దృష్టిసారించాలన్న ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు
-అసంఘటిత రంగమైన వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాలి
-వ్యవసాయరంగంలో ఖర్చులు తగ్గించుకుంటే రాబడి సహజంగానే పెరుగుతుంది.. ఈ దిశగా పరిశోధనలు మరింత విస్తృతం కావాలి
-ఈ రంగంపై మీడియా కూడా మరింత దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచన

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామరాజ్యం లేని రామ రాజ్యం అసంపూర్ణం అన్న మహాత్మాగాంధీ మాటల స్ఫూర్తితో.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సాధికారత, స్వావలంబనతోపాటు పల్లెల్లో సుపరిపాలన జరగాలనేది తన ఆకాంక్ష అని భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తమ చిన్నతనంలో పల్లెలకు, పట్టణాలకు అంత అంతరం ఉండేది కాదని, కానీ క్రమంగా పరిస్థితులో మార్పు వచ్చి, గ్రామాలను పట్టణాలకు ఆహారాన్ని అందించే కర్మాగారాలుగానే చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారి పల్లెల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఏదైనా పండుగ వచ్చినప్పుడు గ్రామాలకు తరలివెళ్ళి అక్కడి సమస్యలు తెలుసుకుని, సాధ్యమైనంతమేర వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.
మాజీ పార్లమెంట్ సభ్యులు  యలమంచిలి శివాజీ రచించిన ‘పల్లెకు పట్టాభిషేకం’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణం, వ్యవసాయం రెండూ పరస్పర ఆధారితమైన అంశాలని, ఒకదాన్నుంచి మరొకదాన్ని వేరుచేసి చూడలేమన్నారు. అందుకే గ్రామాలకు పునర్వైభవం తీసుకురావడానికి విస్తృతమైన కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రతి గ్రామం తన గమ్యాన్ని తానే నిర్దేశించుకోగల స్థాయిలో ఉండాలన్న ఉపరాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాల కారణంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగం పుంజుకుంటోందని అయితే ఈ పక్రియ మరింత వేగవంతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మహత్కార్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధలకులతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. అప్పుడే గ్రామస్వరాజ్య స్వప్నం వేగంగా సాకారం అవుతుందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయరంగానిదే సింహభాగం అన్న ఉపరాష్ట్రపతి, లోకమంతా తిండి తినేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడన్నారు. అందుకే అమ్మతర్వాత అంత గొప్ప మనసున్నది అన్నదాతేనని తాను తరచుగా చెబుతూ ఉంటానని గుర్తుచేశారు. కరోనా సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయినా, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి రెట్టింపయిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇదంతా మన రైతుల ఘనతేనని చెప్పుకొచ్చారు.
కోవిడ్ మహమ్మారి విసురుతున్న సవాళ్ళలో భాగంగా రాబోయే రోజుల్లో తీవ్ర ఆహారం సంక్షోభం రానుందన్న ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ (ఎఫ్.ఏ.ఓ) ప్రకటనను ఉటంకిస్తూ, ఈ నేపథ్యంలో అన్ని వేళలా శ్రమించేందుకు సిద్ధంగా ఉండే అన్నదాతలకు మనం సకాలంలో చేయూతను అందించగలిగితే, మన ఆహార అవసరాలను తీర్చుకోవడంతోపాటుగా ప్రపంచం ఆకలి తీర్చేందుకు కూడా భారతదేశం ముందుకు రాగలదన్నారు.
ఇందుకోసం రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధరను అందించటంతోపాటు సకాలంలో, సరసమైన విధంగా రుణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల రవాణాపై ఆంక్షలు తొలగించి గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు నిల్వసామర్థ్యం, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మరింత పెరగాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం మేర ఎగుమతులు పెరగడం అభినందనీయమని తెలిపారు. ఎగుమతులు పెరగడం వల్ల రైతుకు లాభసాటి మాత్రమే గాక, విదేశీమారకద్రవ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే రైతులు ఎక్కువగా పండించడం కంటే ఖర్చులు తగ్గించుకునే పద్ధతుల మీద దృష్టి సారించాలన్న ఆయన, ఖర్చు తగ్గించుకుంటే మిగులు మొత్తం రాబడే అవుతుందని పేర్కొన్నారు. దీంతో పాటుగా నీరు, విద్యుత్ లాంటి విలువైన వనరులను ఆచితూచి వినియోగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుందన్న ఉపరాష్ట్రపతి, సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగినందున దీనిపైనా దృష్టిసారించాలన్నారు. నీటిఎద్దడిని తట్టుకుని పెరిగే పంటల దిశగా ఆలోచన చేయాలని సూచించారు. రైతులు పూర్తిగా వ్యవసాయంపైనే కాకుండా, అనుబంధ రంగాలపైనా దృష్టి పెట్టాలని, పశుపోషణ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు, కోళ్ళు, చేపలు, రొయ్యల పెంపకం ద్వారా వ్యవసాయంలో ఒకవేళ నష్టం వచ్చినా వీటి ద్వారా పూరించుకోవచ్చన్నారు. రైతు ఆత్మహత్యల నివేదికలను పరిశీలిస్తే, కేవలం వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులు మాత్రమే సమస్యలు ఎదుర్కొన్నారన్న విషయం సుస్పష్టమని, అనుబంధ రంగాల మీద దృష్టి సారించిన వారు ఎలాంటి సమస్యలూ ఎదుర్కోలేదన్నారు.
వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ముందు యువత ఈ రంగం దిశగా దృష్టి కేంద్రీకరించాలన్న ఉపరాష్ట్రపతి, నిజాయితీగా కష్టపడే చదువుకున్న యువకులు గ్రామాలకు తరలి, తెలివితేటల్ని ఉపయోగిస్తే మన భూములు మళ్లీ బంగారు మాగాణులవ్వడం ఖాయమని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనల ఫలితాలు నేరుగా పొలాలకు చేరాలన్న ఆయన, వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని అప్పుడే రైతులకు అసలైన లాభం ఉంటుందన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధిలో మీడియా పాత్ర కూడా కీలకమన్న ఉపరాష్ట్రపతి, కొన్ని పత్రికలు, ఛానళ్ళు మాత్రమే రైతు కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నాయని ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, కనీసం పత్రికల్లో ఓ పేజీ, ఛానళ్లలో ఓ అరగంట కేటాయించాలని సూచించారు.
తనకు వ్యవసాయరంగం, భారతీయ గ్రామీణ జీవన విధానం, ప్రకృతితో మమేకమై జీవించడం, భారతీయ వేషధారణలు, సంస్కృతి సంప్రదాయాలు, మాతృభాష, భారతీయ సంగీతం, సాహిత్యం, కళలు, సినిమాలు, యోగ, వ్యాయామం వంటి అంశాలతోపాటు యువతతో సంభాషించడం, ప్రజలతో మమేకం కావడం లాంటి పది అంశాలు మనసుకు అత్యంత చేరువైన అంశాలని ఉపరాష్ట్రపతి తెలియజేశారు. ఈ అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు మరింతగా ప్రజలతో మమేకమయ్యేలా తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని తెలిపారు.
పుస్తక రచయిత యలమంచిలి శివాజీని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు. వారి కలం నుంచి జాలువారిన వ్యాసాల సంకలనాన్ని చక్కటి శీర్షికతో తీసుకురావడాన్ని ఆయన ప్రశంసించారు. గ్రామీణ భారతం ఎదుర్కొంటున్న సవాళ్లను, ప్రత్యేకించి వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సమస్యలను ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారన్నారు. యువత ఈ పుస్తకాన్ని చదివి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదతర అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత యలమంచిలి శివాజీ, కృతిభర్త  తాళ్ళ వెంకట సునీల్ కుమార్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కార్యదర్శి డా. టి.సత్యనారాయణ, రైతునేస్తం పబ్లిషర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *