-రేపు వాయుగుండంగా బలపడే అవకాశం
-రానున్న మూడు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు
-మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోంది. అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న నికోబార్ దీవుల ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం రేపు (శనివారం) ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అనంతరం రానున్న రెండు రోజుల్లో ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మూడు రోజుల వర్ష సూచన.. జిల్లాల వారీగా వివరాలు
శనివారం (31-10-2026):
మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.
ఆదివారం (01-11-2026):
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
సోమవారం (02-11-2026):
తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వివరించారు.
పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు
ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది.
జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు:
కోనసీమ జిల్లా నగరం – 91.5 మి.మీ.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు – 81.2 మి.మీ.
అనకాపల్లి జిల్లా చోడవరం – 80.2 మి.మీ.
కాకినాడ జిల్లా వేలంగి – 76.9 మి.మీ.
కృష్ణా జిల్లా మచిలీపట్నం – 76.7 మి.మీ.
కోనసీమ జిల్లా మామిడికుదురు – 54.2 మి.మీ.
అనకాపల్లి జిల్లా దేవరపల్లి – 52.5 మి.మీ.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అధికారుల హెచ్చరికలను పాటించాలని, వర్షాల సమయంలో ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
