పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్

-రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ హాల్‌లో ఏర్పాట్లపై సమీక్ష

నందిగామ/కొండపల్లి/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్‌టీఆర్ జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ నాగలక్ష్మి.ఎస్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

తొలుత నందిగామ పరిధిలోని అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లోట్టి గ్లోబల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేపట్టిన సౌకర్యాలను తనిఖీ చేశారు.

అనంతరం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జనరల్ అబ్జర్వర్, డీఏవీ పబ్లిక్ స్కూల్, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు హాల్‌ను సందర్శించి ఎన్నికల సామగ్రి స్వీకరణ, భద్రపరచడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

విజయవాడ నగర పరిధిలోని బిషప్ హాజరయ్య బాలికల ఉన్నత పాఠశాల, బోయపాటి శివరామకృష్ణ విజయవాడ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జనరల్ అబ్జర్వర్ నాగలక్ష్మి.ఎస్ సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు, ఓటర్లకు కల్పించాల్సిన వసతులు, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి దశలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జనరల్ అబ్జర్వర్ అధికారులకు స్పష్టం చేశారు.

ఈ సందర్భంలో నందిగామ మున్సిపల్ కమిషనర్ జి.లోవ రాజు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.