విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఆదివారం సాయంత్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి 33 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 130 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు గైర్హాజరైనట్లు అధికారులు గుర్తించారు.
ఎన్నికల విధులకు సంబంధించి నిర్వహించిన కీలక శిక్షణ కార్యక్రమానికి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ గైర్హాజరైన సిబ్బందిపై అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర క్రమశిక్షణ చర్యలు జారీ చేశారు. ఎన్నికల విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నియమితులైన ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా తమ విధులకు హాజరై శిక్షణలో పాల్గొనాలని తెలిపారు.
