ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్‌కు ఎందుకింత ఆందోళన?: ఎమ్మెల్యే బొండా ఉమా

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంటే పులివెందులలోనే వివాదాలు, ఉద్రిక్తతలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయని ప్రశ్నించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. పులివెందులలో ఓటమి భయంతోనే జగన్‌ వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. హెలికాప్టర్ సాధారణంగా ల్యాండ్ అయినప్పటికీ అత్యవసర ల్యాండింగ్ అంటూ సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.

విజయవాడలోని 870 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పోలింగ్ కొనసాగుతోందని పేర్కొన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులలో 33 వార్డులూ ఏకగ్రీవం కావడం వెనుక బెదిరింపులు, అధికార బలం ఉన్నాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

2019–2024 మధ్య వైసీపీ పాలనలో అవినీతి, దౌర్జన్యాలు, రాజకీయ కక్షసాధింపు పెరిగాయని బొండా ఉమా ఆరోపించారు. గతంలో జరిగిన రాజకీయ దాడులు, ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో ఫ్యాక్షన్‌, గ్యాంగ్‌ రాజకీయాలకు ఇకపై తావులేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.