తుపానుతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కేంద్ర బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
కాకినాడ జిల్లా తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న వరి పంటలను కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఆదివారం పరిశీలించింది. తాళ్లరేవు మండలం పోలేకూరు, బాపనపల్లి, కాజులూరు మండలం కొలంకి గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు సేకరించింది. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా నష్టపోయామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా త్వరగా అందించాలని, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఎండోమెంట్ భూముల శిస్తు రద్దు చేయాలని కోరారు. పశుగ్రాసం కొరతను కూడా కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. బృందానికి కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాస్ నేతృత్వం వహించగా, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.