-భద్రతా చర్యలు, అత్యవసర సన్నద్ధతపై జీఎం సందీప్ మాథుర్ సమీక్ష
-జోనల్ ప్రధాన కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేస్తున్న వార్ రూమ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
మురాసు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో దక్షిణ తీర రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భద్రతతో పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, విపత్తు నిర్వహణ సన్నద్ధతపై దక్షిణ తీర రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ సమీక్ష నిర్వహించారు. డివిజనల్ రైల్వే మేనేజర్లు (DRMs), ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (PHODs) ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైల్వే వంతెనలు, ట్రాక్‌లు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థలపై 24 గంటల పాటు నిరంతర నిఘా ఉంచాలని జీఎం అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిలిచిపోకుండా క్యాచ్ వాటర్ డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని సూచించారు.
ప్రమాదకర ప్రాంతాలు, వంతెనల వద్ద పెట్రోలింగ్ సిబ్బంది, వాచ్మెన్లను నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్ మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జీఎం ఆదేశించారు.
24 గంటల వార్ రూమ్ ఏర్పాటు
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు దక్షిణ తీర రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంతో పాటు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే వార్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వివిధ విభాగాల మధ్య సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ప్రయాణికుల సౌకర్యాలకు ప్రత్యేక చర్యలు
ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు తగిన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లు రద్దయిన పక్షంలో టికెట్ రీఫండ్ల కోసం అదనపు కౌంటర్లు నిర్వహించనున్నారు.
కేటరింగ్ యూనిట్లలో తగినంత ఆహార నిల్వలు ఉంచాలని, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యవసర వైద్య సేవల కోసం వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సదుపాయాలు, అంబులెన్స్‌లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచుతున్నారు.
సివిల్ డిఫెన్స్ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర స్పందన బృందాలను కూడా సిద్ధం చేశారు.
తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాల్లో కొన్ని రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ తీర రైల్వే ప్రకటించింది.
రద్దు చేసిన రైళ్ల వివరాలు:
రైలు నంబర్ 67225 – విజయవాడ – గూడూరు ప్యాసింజర్ (నవంబర్ 2న బయలుదేరేది).
రైలు నంబర్ 67226 – గూడూరు – విజయవాడ ప్యాసింజర్ (నవంబర్ 3న బయలుదేరేది).
రైలు నంబర్ 12744 – విజయవాడ – గూడూరు ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 2న బయలుదేరేది).
రైలు నంబర్ 12743 – గూడూరు – విజయవాడ ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 3న బయలుదేరేది).
రైలు నంబర్ 67235 – గుంటూరు – తెనాలి ప్యాసింజర్ (నవంబర్ 2న బయలుదేరేది).
రైలు నంబర్ 67236 – తెనాలి – గుంటూరు ప్యాసింజర్ (నవంబర్ 3న బయలుదేరేది).
రైలు నంబర్ 67237 – తెనాలి – రేపల్లె ప్యాసింజర్ (నవంబర్ 2న బయలుదేరేది).
రైలు నంబర్ 67238 – రేపల్లె – మార్కాపురం ప్యాసింజర్ (నవంబర్ 3న బయలుదేరేది).
రైలు నంబర్ 67239 – మార్కాపురం – తెనాలి ప్యాసింజర్ (నవంబర్ 3న బయలుదేరేది).
తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు రైళ్ల రాకపోకల వివరాలను ముందుగానే తెలుసుకుని ప్రయాణాలు చేయాలని రైల్వే అధికారులు సూచించారు.
