-పాఠశాల విద్య సంచాలకులు ఎ. తమీమ్ అన్సారియా, I.A.S.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అటవీ (సైన్స్) శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నవంబర్ 1 నుండి 7వ తేదీ వరకు ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు (BRICS Sustainable Lifestyle Week) ఘనంగా నిర్వహించాలని పాఠశాల విద్య సంచాలకులు ఎ. తమీమ్ అన్సారియా, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు.
మిషన్ లైఫ్ లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలు, పౌర భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని, రోజువారీ వివరాలు, ఫొటోలు తప్పనిసరిగా, విధిగా
https://ecoclubs.education.gov.in/ వెబ్సైట్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నోడల్ ఆఫీసర్గా పాఠశాల విద్య సంచాలకులు వ్యవహరిస్తుండగా, జిల్లా స్థాయిలో డీఈఓలు, సమగ్ర శిక్ష ఏపీసీలు జిల్లా నోడల్ అధికారులుగా పర్యవేక్షిస్తారని తెలిపారు. వారం రోజులు జరిగిన కార్యక్రమాలను జిల్లా నివేదిక రూపంలో స్టేట్ నోడల్ ఆఫీసర్ గారికి అందజేయాలని డీఈవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సమీక్షించనున్నట్లు తెలిపారు.
వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలివే
• నవంబర్ 01 (ఆరోగ్యకర జీవనశైలి సాధన): మిషన్ లైఫ్ ప్రతిజ్ఞ, యోగా, వాకథాన్, సైక్లోథాన్, మొక్కలు నాటే కార్యక్రమాలు.
• నవంబర్ 02 (విద్యుత్ ఆదా): స్విచ్-ఆఫ్ అవర్ (Switch-off hour), పోస్టర్లు, నినాదాలు, తరగతుల వారీగా విద్యుత్ పొదుపు సవాళ్లు.
• నవంబర్ 03 (నీటి సంరక్షణ): క్యాంపస్ వాటర్ ఆడిట్, నీటి లీకేజీల పరిశీలన, వర్షపు నీటి నిల్వపై అవగాహన, నీటి పునర్వినియోగం.
• నవంబర్ 04 (సుస్థిర ఆహార వ్యవస్థలు): చిరుధాన్యాలు (మిల్లెట్స్), సంప్రదాయ ఆహార ప్రదర్శనలు, ఆహార వృథా అరికట్టడం, కంపోస్టింగ్, కిచెన్ గార్డెనింగ్.
• నవంబర్ 05 (సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం): ప్లాస్టిక్ రహిత క్యాంపస్, బహుళ వినియోగ బాటిళ్లు/బ్యాగుల వాడకం పెంపొందించడం, ప్లాస్టిక్ సేకరణ.
• నవంబర్ 06 (ఈ-వేస్ట్ తగ్గింపు): ఎలక్ట్రానిక్ వ్యర్థాల మరమ్మత్తు, పునర్వినియోగం, గుర్తింపు పొందిన రీసైక్లర్లకు మాత్రమే అందజేయడంపై అవగాహన.
• నవంబర్ 07 (చెత్త తగ్గింపు & రీసైక్లింగ్): క్యాంపస్ శ్రమదానం, చెత్త వర్గీకరణ (Waste Segregation), 3R (Reduce-Reuse-Recycle) పద్ధతులు, విద్యార్థుల సాధనల ప్రదర్శన.
