స్థానిక ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదు

-ర్యాలీలు, ఊరేగింపులు, డీజేలు, బాణసంచాపై నిషేధం
-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన క్రిమినల్ కేసులు: నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రేపు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ స్పష్టం చేసింది. విజయోత్సవాల పేరుతో డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహించడం, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో కూడిన మైక్ సెట్లు, డీజేలను ఉపయోగించడం పూర్తిగా నిషేధించినట్లు పోలీసులు తెలిపారు.

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్, పోలీస్ యాక్ట్ (30 Police Act) అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు సూచించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలందరూ పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐపీఎస్ కోరారు. ప్రజలందరూ పరస్పర శాంతి, సామరస్యాలను పాటిస్తూ పోలీసుల సూచనలకు సహకరించాలని ఆయన ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.