-భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన పుష్కర అనుభవం కల్పించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి
-సమగ్ర పరిశీలన చేసి నివేదిక అందచేయాలీ.
-సమగ్ర పరిశీలన చేసి నివేదిక అందచేయాలీ.
-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి మహా పుష్కరాలు – 2027 నిర్వహణకు సంబంధించి రూపొందిస్తున్న అన్ని ప్రణాళికలు క్షేత్రస్థాయిలో ఆచరణ సాధ్యమయ్యేలా స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు.
పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
బుధవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ గోదావరి మహా పుష్కరాలు రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమమని పేర్కొన్నారు. ఘాట్ల అభివృద్ధి, రవాణా నిర్వహణ, పార్కింగ్ సదుపాయాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు, పుష్కర్ నగర్ల ఏర్పాటు తదితర అంశాలపై శాఖల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
విజయవాడ వైపు నుంచి వచ్చే రైళ్లను కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో, విశాఖపట్నం వైపు నుంచి వచ్చే రైళ్లను గోదావరి రైల్వే స్టేషన్‌లో నిలిపే అవకాశాలను పరిశీలించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఆర్టీసీ బస్సులు రానున్నాయి, వాటి పార్కింగ్ కోసం ఎక్కడెక్కడ స్థలాలు గుర్తించవచ్చనే అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.
పుష్కరాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, రియల్‌టైమ్ క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, సీసీటీవీ నిఘా, డ్రోన్ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన వ్యవస్థలను ముందుగానే అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువుల్లో పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
సమగ్ర పరిశీలన చేసి నివేదిక అందచేయాలీ
అనంతరం చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (CUMTA) బృందం గోదావరి మహా పుష్కరాలకు సంబంధించి రూపొందించిన మొబిలిటీ ప్లాన్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సమావేశంలో ప్రదర్శించింది. గత నెలలో రాజమహేంద్రవరం, కొవ్వూరు ప్రాంతాల్లో పర్యటించిన బృందం ఘాట్లు, రవాణా మార్గాలు, ఖాళీ స్థలాలు, పార్కింగ్ ప్రాంతాలు, పుష్కర నగర్ల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రూపొందించిన నివేదికను సమావేశంలో వివరించింది.
పుష్కరాల సందర్భంగా ఒకే రోజు గరిష్టంగా 66 లక్షల మంది భక్తులు విచ్చేసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని మొబిలిటీ ప్రణాళిక రూపొందించినట్లు బృందం తెలిపింది. కొవ్వూరు మండలం వాడపల్లి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న ఘాట్లను ఏకీకృతం చేసి సుమారు రెండు కిలోమీటర్ల పొడవున తాత్కాలిక ఘాట్‌ను అభివృద్ధి చేస్తే అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అవకాశం ఉంటుందని వివరించింది. నదీ తీర పరిరక్షణతో పాటు ఘాట్ల స్థిరీకరణ కోసం గాబియన్ బాస్కెట్లు, రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని ప్రతిపాదించింది.
జిల్లాలో ప్రధానంగా 11 ఘాట్లను అభివృద్ధి చేస్తే రోజుకు సుమారు 63 లక్షలకు పైగా మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగల సామర్థ్యం ఏర్పడుతుందని బృందం వివరించింది. కొవ్వూరు వైపున వాడపల్లి–శివాలయం–సుమా స్కూల్ ఘాట్, గోష్పాదక్షేత్రం ఘాట్, శ్రీనివాస–వెరినమ్మ ఘాట్, ఔరంగాబాద్ ఘాట్, స్పెక్ ఘాట్, గౌతమి దండగుండ ఘాట్‌లను, రాజమహేంద్రవరం వైపున కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్, కాతేరు వీఐపీ ఘాట్, ధోబీఘాట్–సరస్వతి ఘాట్–అయ్యప్ప ఘాట్ సముదాయం, గాయత్రి ర్యాంప్ ఘాట్‌లను ప్రధాన ఘాట్లుగా గుర్తించినట్లు తెలిపింది.
రాజమహేంద్రవరం వైపుతో పోలిస్తే కొవ్వూరు వైపున ఘాట్ల సామర్థ్యం అధికంగా ఉన్నందున భక్తుల రద్దీని సమతుల్యం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించింది. అలాగే 11 ప్రధాన ఘాట్లకు అనుసంధానంగా 23 పుష్కర్ నగర్లను సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసి వాటిని భక్తుల హోల్డింగ్ ఏరియాలుగా వినియోగించాలని ప్రతిపాదించింది. ఈ పుష్కర్ నగర్లలో ఆహారం, మరుగుదొడ్లు, విశ్రాంతి కేంద్రాలు, పార్కింగ్, షటిల్ బస్సు సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులను దశలవారీగా ఘాట్లకు తరలించడం ద్వారా రద్దీని సమర్థవంతంగా నియంత్రించవచ్చని వివరించింది.
భక్తుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రత్యేక బస్ టెర్మినళ్లు, షటిల్ బస్సు మార్గాలు, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, రైల్వే స్టేషన్ల వద్ద అదనపు ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల నిర్వహణ కోసం ప్రత్యేక కారిడార్లు, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, సీసీటీవీ నిఘా, ఆధునిక క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
సమగ్ర పరిశీలన చేసి నివేదిక అందచేయాలీ. కలెక్టర్
సమావేశంలో CUMTA బృందం ప్రతిపాదించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి వాటి సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ఘాట్లు, పుష్కర్ నగర్లు, రవాణా నిర్వహణ, భక్తుల రాకపోకల నియంత్రణ, అత్యవసర స్పందన వ్యవస్థలపై సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, డి.ఆర్.ఓ భాస్కర్ రెడ్డి, CUMTA బృందం సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News