Breaking News

ప్రభుత్వ ప్రోత్సాహంతో పల్లెల్ని అభివృద్ధి చేసుకుందాం

-గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచడంతోనే అభివృద్ధి
-గత ఐదు సంవత్సరాలు ఉపాధి హామీ పథకాన్ని కూడా తాకట్టు పెట్టారు
-ఉపాధి హామీలో 32 కార్యక్రమాలను చేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు దే
-మేకవానిపాలెంలో వీబీ జీ రామ్ జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో సదుపాయాల కల్పనే లక్ష్యంగా గతంలో ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టమని, ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాక్ష్యాత్కరించేలా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజర్ ఆజ్విక మిషన్ పథకానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు మచిలీపట్నంలోని మేకవానిపాలెంలో వీబీ జీ రామ్ జీ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విధుల్లో ఉన్న ఉపాధి హామీ కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు.

గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు.. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేశారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవడంతో.. పనికి ఆహార పథకాన్ని నాడు నారా చంద్రబాబు నాయుడు గారే ప్రతిపాదించారు. పని చేసిన వారికి డబ్బుకు బదులుగా బియ్యం అందించారు. తర్వాత మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చి చేసిన పనికి వేతనం చెల్లించారు. 2014లో దేశంలోనే తొలిసారిగా మెటీరియల్ కాంపౌండ్ జత చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. అప్పటి వరకు కాలువలు తవ్వడం, చెరువులు తవ్వడం, రోడ్లు వేసేందుకు మట్టి తవ్వడం మాత్రమే ఉంటే.. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో గ్రామాల్లో 32 రకాల పనుల్ని చేర్చారు. ఫలితంగా సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది.

ప్రపంచంలో నాలుగో ఆర్ధిక శక్తిగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. మనకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపే అవకాశం లభిస్తుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా.. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఉపాధి హామీ పథకంలో పనిదినాలను పెంచడంతో పాటుగా చెరువులు, కాలువలు వంటి ప్రాధాన్యమైన పనుల్ని పూర్తి చేసుకుందాం. గతంలో పంచాయతీ రాజ్ మంత్రిగా పని చేసిన నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పవన్ కల్యాణ్ గారు కృషి చేస్తున్నారు.

గత ఐదు సంవత్సరాలు ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో గాలికి వదిలేశారు. కేంద్రం నుండి వచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లించడంతో గ్రామాల్లో కనీస సదుపాయాలు లేకుండా చేశారు. గత ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క రోడ్డుపై తట్ట మట్టి వేసిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మచిలీపట్నం నియోజకవర్గంలో రూ.42 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. జిల్లాలో 2,21,812 మంది ఉపాధి హామీ కార్మికులుంటే.. మచిలీపట్నం నియోజకవర్గంలో 18,116 మంది ఉన్నారు. జిల్లాలో 49 లక్షల పనిదినాలు, నియోజకవర్గంలో 3.35 లక్షల పనిదినాలు కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకంతో రూ.53 కోట్లతో 393 రోడ్లు ప్రతిపాదించగా 382 రోడ్లలో పనులు పూర్తి చేశాం. మచిలీపట్నంలో అభివృద్ధి ఎప్పుడూ కూటమి ప్రభుత్వ హాయంలోనే జరుగుతోంది. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి అందించి తీరుతాం.

మచిలీపట్నం బీచ్ రోడ్ సహా నియోజకవర్గంలోని అన్ని రోడ్లను మెరుగు పరుస్తున్నాం. సాస్కీ కింద రూ.19 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించుకుంటాం. రూ.20 కోట్లతో కానూరు బ్రిడ్జి పనులు ప్రారంభిస్తాం. కరగ్రహారం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. బందరుకోట నుండి గరాలదిబ్బ మీదుగా కోడూరు వరకు బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పిస్తాం. అదే సమయంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి పని చేస్తున్నాం. త్వరలోనే అందరికీ ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నాం.

జనవరి నాటికి బందరు పోర్టును పూర్తి చేయబోతున్నాం. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా ఏర్పాటవుతున్నాయి. పోర్టు, మంగినపూడి బీచ్ అభివృద్ధికి ఎలాంటి విఘ్నాలు కలగకూడదనే ఉద్దేశ్యంతో 63 అడుగుల మహాగణపతిని బందరు బీచ్‌లో ఏర్పాటు చేయబోతున్నాం. రేపు ఉదయం 7.11కి భూమి పూజ చేస్తున్నాం. తద్వారా ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసిస్తున్నాం. హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరుచేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.65 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అందించాం. చదువుకునే ప్రతి బిడ్డకీ తల్లికి వందనం అమలు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. అన్ని సదుపాయాలు ఉచితంగా అందిస్తున్నాం. జులై 15 నాటికి తల్లికి వందనం నగదు జమచేయబోతున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఉచిత గ్యాస్ పథకంలో ఇప్పటి వరకు సుమారు నాలుగున్నర కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించాం. ఉచిత బస్సు పథకాన్ని పక్కాగా అమలు చేశాం.

మన పిల్లలకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ప్రజలకు మంచి చేయాలి, మంచి పాలన అందించేందుకు కష్టబడి పని చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా కులం, మతం, ప్రాంతం పేరుతో కుట్రలు చేస్తున్నాడు. 2019 ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అన్న వ్యక్తి.. గెలిచాక మూడు రాజధానుల పేరుతో రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పుడు మావిగన్ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపాడు. అమరావతి వెళ్లి రైతులతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే.. ప్రజలు తరిమి తరిమి కొట్టారు. బందరు నుండి కూడా ఒక సైకో వెళ్లాడు. ప్రజలు తరిమితే తేలుకుట్టిన దొంగలా పారిపోయి వచ్చాడు.

జగన్ రెడ్డి లాంటి సైకో రాష్ట్రానికి అవసరమా? జగన్ రెడ్డి వైఖరితో రాష్ట్ర అభివృద్ధి పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం కల్పించలేదు. తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు, తప్పుడు కేసులు, అరాచకాలతో వేధించాడు. నన్ను కూడా తప్పుడు కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టాడు. ఇప్పుడు కూడా అదే విధమైన వైఖరి అవలంబిస్తున్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మూడు నాలుగు దఫాలు అధికారంలో ఉంటే దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది.

ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సైకో నిర్ణయాలతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు. విధ్వంసం తప్ప అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ప్రజలంతా తిరగబడి 11 సీట్లకు పరిమితం చేశారు. ఓటమితో మార్పు వస్తుందని భావించినప్పటికీ.. ఏ మాత్రం మార్పు రాలేదు. గతంలో తుగ్లక్ రాజధానిని ఢిల్లీ, ఔరంగాబాద్ అంటూ ఎలా తిప్పాడో.. ఇప్పుడు జగన్ రెడ్డి అంతకు మించి పోయాడు. అమరావతే రాజధాని అని అధికారంలోకి వచ్చాక.. అమరావతి రైతుల్ని లాఠీలతో కుళ్లబొడిచాడు. జగన్ రెడ్డి అరాచకాన్ని ప్రజలు తిప్పికొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. నిన్నటికి నిన్న అమరావతి పరిరక్షణ అంటూ ఏదో చేయబోతే ప్రజలు తన్ని తరిమేశారు. ఇప్పుడు మావిగన్ అంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. నిలకడలేని వ్యక్తులు రాజకీయాలకు పనికిరారు. ఐదేళ్లు జగన్ రెడ్డి దుర్మార్గాల కారణంగా చాలా నష్టపోయాం. కూటమి ప్రభుత్వ హాయంలో అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పెట్టుబడులు వచ్చి యువత బాగుపడితే.. జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుల ఆటలు సాగవనే లక్ష్యంతో అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నాడు. ఇలాంటి వైసీపీ నేతలను తరిమికొట్టే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకోవాలి.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ శ్రమిస్తుంటే.. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. ఒకవైపు అమరావతి పరిరక్షణ అంటూ రౌడీలను వేసుకుని వెళ్తాడు. జగన్ రెడ్డి అమరావతి వద్దు.. మావిగన్ ముద్దు అంటూ మతిలేని మాటలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. అటు కుప్పం ఇటు శ్రీకాకుళం వరకు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలి, రాష్ట్రాన్ని నాశనం చేయాలన్నదే జగన్ రెడ్డి ఏకైక లక్ష్యం. ఇలాంటి క్రిమినల్ మైండెడ్ వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. మళ్లీ జగన్ రెడ్డిని ప్రజలు ఆదరించే అవకాశమే లేదు. వైసీపీ నాయకులు కూడా జగన్ రెడ్డి వైఖరి చూసి దిక్కులేని స్థితిలో కొనసాగుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యన్నారాయణ, రూరల్ మండలాధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *