-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పలు చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తోందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
బుధవారం సాయంత్రం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (National Clean Air Programme – NCAP) అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆడిట్ సంస్థ సీఎస్‌ఐఆర్–నీరీ (CSIR–NEERI), అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని నగరంలో ఎన్‌సీఏపీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు ఎండ్-టు-ఎండ్ రోడ్ల అభివృద్ధి, వర్టికల్ గార్డెన్ల ఏర్పాటు, ఫౌంటెన్ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్, రోడ్డు డివైడర్లలో పచ్చదనం పెంపు, మిస్ట్ వాహనాల వినియోగం, మెకానికల్ రోడ్ స్వీపింగ్ వాహనాల ద్వారా రోడ్ల శుభ్రత వంటి చర్యలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే రోడ్లపై దుమ్ము వ్యాప్తిని తగ్గించడం, నగర హరితావరణాన్ని విస్తరించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, సీఎస్‌ఐఆర్–నీరీ ప్రతినిధులు, ఏపీ సీపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ హేమ మాల్య, జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News