పేదలకు సరళీకృత పరిపాలన, రెవెన్యూ సంస్కరణలే ప్రభుత్వ లక్ష్యం

-ఉయ్యూరులో నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు శాసనసభ్యుడు బోడె ప్రసాద్ తదితరులతో కలిసి ప్రారంభోత్సవం చేసిన మంత్రి

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేదలకు హక్కులు కల్పిస్తూ, పారదర్శకమైన, సరళీకృతమైన రెవెన్యూ పరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

ఉయ్యూరు మండలంలో నూతనంగా నిర్మించిన ఉయ్యూరు తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బోడె ప్రసాద్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉయ్యూరులో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఐసీడీఎస్ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా సమగ్ర పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన 2014-19లోనే రూపుదిద్దుకుందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఒకేచోట అన్ని ప్రభుత్వ సేవలు అందేలా రూపొందించిన ఈ ప్రణాళికను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకువచ్చారని చెప్పారు. అనంతరం వచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయగా, 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చొరవతో, దాతల సహకారంతో ఈ భవనం పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

గ్రామసభలు, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన వినతులను స్వీకరించి, ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రెవెన్యూ వ్యవహారాలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సుపరిపాలనకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా రీ-సర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతుల ఈ-కేవైసీ, వారి అంగీకారం అనంతరం మాత్రమే పాస్‌బుక్‌లు ముద్రించి అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, సరిదిద్దిన భూ రికార్డులు, పాస్‌బుక్‌లను స్వయంగా అందజేస్తున్నారని పేర్కొన్నారు.

పేదలు అనుభవిస్తున్న భూ సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. కుటుంబ వివాదాలు మినహా ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగల అన్ని రెవెన్యూ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

రీ-సర్వేను పకడ్బందీగా అమలు చేస్తూనే, 22-ఏ నిబంధనలను కూడా సరళీకృతం చేస్తున్నామని తెలిపారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములు తప్ప సాధారణ ప్రైవేటు ఆస్తులను 22-ఏలో చేర్చవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. భూమిని 22-ఏలో చేర్చే ముందు సంబంధిత వ్యక్తికి సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేశామని చెప్పారు.

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో చారిత్రక సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు స్లాట్ బుకింగ్, సేవా కేంద్రాలు, ఆటోమేషన్ వంటి ఆధునిక విధానాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇవన్నీ సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు.

రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్న మంత్రి, అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు విశాఖపట్నాన్ని ఐటీ, ఏరోస్పేస్ కేంద్రంగా, ఇతర ప్రాంతాలను ప్రత్యేక రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.23 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని, ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఆధునిక మౌలిక వసతులతో రెవెన్యూ కార్యాలయాల అభివృద్ధి –– జిల్లా కలెక్టర్

జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ప్రజలతో అత్యంత ప్రత్యక్ష సంబంధం కలిగిన శాఖ రెవెన్యూ శాఖ అని, ప్రతి రోజు అనేక మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాలను ఆశ్రయిస్తారని అన్నారు.

కార్యాలయానికి వచ్చే ప్రతి పౌరుడికి తన సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకం కలిగేలా ఆధునిక మౌలిక వసతులు, ప్రజలకు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ లక్ష్యంతో ఉయ్యూరులో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనం ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్వచ్ఛందంగా భూమిని అందించిన మాజీ ప్రజాప్రతినిధి సజ్జా వెంకటేశ్వరరావుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం తరఫున, ఉయ్యూరు మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల కోసం భూమి సమీకరణలో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయని, అయితే ఉయ్యూరులో మాత్రం స్వయంగా ముందుకు వచ్చి భూమిని అందించడం గొప్ప ప్రజాసేవా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు.

నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం మాత్రమే కాకుండా దాతలు కూడా సహకరించడం అభినందనీయమని పేర్కొంటూ, సహకరించిన ప్రతి దాతకు కృతజ్ఞతలు తెలిపారు.

శంకుస్థాపన చేసిన భవనాన్నే ప్రారంభించే అవకాశం దక్కడం అదృష్టం – ఎమ్మెల్యే బోడె ప్రసాద్

పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు బోడె ప్రసాద్ మాట్లాడుతూ, ఈ భవనానికి శంకుస్థాపన చేసిన తమ చేతుల మీదగానే ప్రారంభోత్సవం జరగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

2014–19 కాలంలో ఉయ్యూరులో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఏర్పాటుకు ఈ స్థలాన్ని కేటాయించినప్పుడు కొందరు వ్యతిరేకించినప్పటికీ, రూరల్, అర్బన్ ప్రాంతాలకు సమానంగా అందుబాటులో ఉండే కేంద్ర ప్రాంతంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ భూమిని ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్, తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు.

పెనమలూరు నియోజకవర్గంలో ఎనమలకుదురు వంతెన, సిద్ధార్థ కళాశాల ఫ్లైఓవర్, మద్దూరు–ఉప్పలూరు రహదారి, కుందేరు వంతెన వంటి కీలక అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటీవల గన్నవరం ప్రాంతంలో పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించినట్లు గుర్తు చేస్తూ, ఉయ్యూరులో కూడా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం దశలవారీగా పూర్తవుతోందన్నారు.

కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డిఓ ఎస్ కరుణ కుమారి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఉయ్యూరు మండలం తహసిల్దార్ సురేష్, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *