-రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై అవగాహన కల్పించిన కలెక్టర్
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు.
బుధవారం గన్నవరం మండలంలోని గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం అమలు విధానం, ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, ఇంటింటి సర్వే, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. అర్హులైన ఓటర్లందరూ తమ వివరాలను బీఎల్వోలకు అందించి, అవసరమైన పత్రాలను సమర్పించే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు, చనిపోయిన వారి ఓటర్ల వివరాలు బి ఎల్ వో లకు అందించాలని కోరారు.
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డేటా డిజిటైజేషన్ చేయడం వంటి ప్రక్రియలు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే జరుగుతాయని, ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలోని ప్రజలకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పించి, బీఎల్వోలతో సమన్వయం చేస్తూ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించాలని కోరారు. సర్ కార్యక్రమంలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ వివరాలు:
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు లేదా సమాచారం కోసం ప్రజలు ఈ క్రింది హెల్ప్ డెస్క్ నంబర్లను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
కృష్ణా జిల్లా కాల్ సెంటర్: 1950
తహసీల్దార్ కార్యాలయం, విజయవాడ రూరల్ – 8555824148
తహసీల్దార్ కార్యాలయం, గన్నవరం – 08676-252394, 98495 31437
తహసీల్దార్ కార్యాలయం, బాపులపాడు – 9154421421
తహసీల్దార్ కార్యాలయం, ఉంగుటూరు – 9912690094
సమావేశంలో గన్నవరం ఈఆర్వో సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల తహసిల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News