మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను నిరోధించే పీసీపీఎన్‌డీటీ చట్టంను జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని, చట్ట నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి హెచ్చరించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం పోక్సో కోర్టు జిల్లా జడ్జి గాజుల వెంకటేశ్వర్లుతో కలసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి వైద్య అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సమావేశంలో కొత్తగా నమోదుకు దరఖాస్తు చేసుకున్న ఆద్య ఫీటల్ కేర్ ఆసుపత్రి (మచిలీపట్నం), ఎం.జె. హాస్పిటల్ (కానూరు), శ్రీ సిద్ధి అడ్వాన్స్డ్ ఫీటల్ కేర్ (గుడివాడ) సంస్థల దరఖాస్తులు, తనిఖీ నివేదికలను కమిటీ పరిశీలించి అనుమతులు మంజూరు చేసింది.
అలాగే అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న కీర్తి హాస్పిటల్ (చల్లపల్లి), ఉత్తమ్ స్కాన్ సెంటర్ (మచిలీపట్నం), సుధాకర్ ఇమేజింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ సెంటర్ (చల్లపల్లి), లతా హాస్పిటల్ అండ్ విజయ ఇమేజింగ్ సెంటర్ (ఉయ్యూరు) సంస్థల దరఖాస్తులు, ఇన్‌స్పెక్షన్ నివేదికలను పరిశీలించి అనుమతులు మంజూరు చేశారు.
అదేవిధంగా అనుమతుల్లో సవరణ (మోడిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకున్న కామినేని హెల్త్ కేర్ (పోరంకి), లైట్ హోమ్ హాస్పిటల్ (పురుషోత్తపట్నం, గన్నవరం), పిన్నమనేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (గన్నవరం) సంస్థల దరఖాస్తులు, తనిఖీ నివేదికలను పరిశీలించి కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పీసీపీఎన్‌డీటీ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447 పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ వివక్షకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసి చట్ట అమలుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. యుగంధర్, అదనపు ఎస్పీ వి.వి. నాయుడు, ఎన్‌జీఓ సభ్యుడు ఎం. ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News