-ఉప ముఖ్యమంత్రి చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు
-హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు
-ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. పవన్ కళ్యాణ్ సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం నరసాపురం లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు నిర్వహించగా, 37 మందికి కంటి సంబంధిత సమస్యలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో 16 మందికి కళ్లలో శుక్లాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అవసరం అయిన వారికి వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శస్త్ర చికిత్స చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపాటి దృష్టి దోష సమస్యలు ఉన్న 21 మందికి కళ్ల జోళ్లు వేయించే ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో మొత్తం 53 మంది హస్తకళాకారులకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రత్యేక పరీక్షలతో పాటు అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
• మహాలక్ష్మికి శంకర నేత్రాలయలో పరీక్షలు
హస్తకళా మహోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గం, పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తమకు నేత్ర సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయన్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. బుధవారం మహాలక్ష్మితోపాటు అందే లక్ష్మి అనే మరో లేస్ కళాకారిణిని పవన్ కళ్యాణ్ ప్రత్యేక వాహనంలో పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రికి పిలిపించి పరీక్షలు చేయించారు. ఇరువురికీ దృష్టి దోష సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, మందులు ఇప్పించి పంపారు.
Prajavartha Online Telugu News