గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందని ఓటర్లు ఉంటే సమీప సచివాలయంలో సిబ్బందిని సంప్రదించి ఫారం పొందాలని, మరో 6 రోజుల్లో గడువు ముగుస్తున్నందున ఫారాలు అందిన వారు వెంటనే పూర్తి చేసి ఇవ్వాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. బుధవారం కాకుమానువారి తోట, శారద కాలనీ, బుచ్చయ్య తోట, రామిరెడ్డి తోట ప్రాంతాల్లోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఓటరు బాధ్యతాయుతంగా, అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారం అందని ఓటర్లు సమీప సచివాలయంలో ఫారం పొందేలా, ఫారం నింపి అక్కడే ఇచ్చేలా తగిన ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ https://voters.eci.gov.in/ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లోపూరించి సమర్పించవచ్చని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల బిఎల్ఏలు మరింత చొరవగా స్తానిక ఓటర్ల దగ్గర నుండి ఫారాలు నింపి ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. ఫారాలు సమర్పించడంలో సందే హాలు ఉంటే సంబంధిత బీఎల్ ఓలను సంప్రదించాలని, లేనిపక్షంలో ఈ నెల 21న ప్రచురించే ముసా యిదా ఓటర్ల జాబితాలో పేరు ఉండకపోవచ్చన్నారు. ఎస్ఐఆర్ పూర్తయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, బీఎల్ఓల వారీగా రోజూ సాయంత్రం రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అత్యల్ప పురోగతి ఉన్న బూత్ లపై సూపర్వైజరీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
బుధవారం నాటికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 2,52,062 ఓటర్లకు గాను 2,51,139 ఫారాలను (99.63 శాతం) పంపిణీ చేసి, అందులో 1,47,751 ఫారాలను డిజిటైజ్డ్ చేశామని వివరించారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓటర్లకు గాను 2,76,860 ఫారాలను (99.39 శాతం) పంపిణీ పూర్తి చేసి, వాటిలో 1,51,105 ఫారాల డిజిటైజ్డ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో సూపర్వైజరీ అధికారులు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News