ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని జూలై 12 నాటికి పూర్తి చేస్తాం

-భారత ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను జూలై 12 నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO)తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పురోగతిని జిల్లా కలెక్టర్ వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటి వరకు 73.4 శాతం ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తయిందని తెలిపారు. అలాగే ASD (Absent, Shifted, Dead) జాబితా పరిశీలనలో 4.42 శాతం పని పూర్తయిందని, మరో 7 నుంచి 8 శాతం వరకు ASD నమోదులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇంకా సేకరించాల్సిన ఫారాలు, ASDకు సంబంధించిన నమోదులను గుర్తించి, వాటి డిజిటలైజేషన్, అప్‌లోడింగ్ ప్రక్రియను వచ్చే 24 గంటల్లో పూర్తి చేస్తామని, శుక్రవారం సాయంత్రాని కల్లా ఈ ప్రక్రియను పూర్తిచేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని వివరించారు. జిల్లాలో మిగిలిన సుమారు 8 శాతం పనిని పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని, జూలై 12 నాటికి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తిచేసి, అనంతరం తుది ధృవీకరణ, సమీక్ష ప్రక్రియలను చేపడతామని తెలిపారు. పని పురోగతిని మరింత వేగవంతం చేయడానికి 80 శాతం కంటే తక్కువ పురోగతి నమోదైన లేదా వెనుకబడిన బూత్‌లకు అదనంగా ఇద్దరు నుంచి ముగ్గురు అధికారులను కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఉదయం వేళల్లో బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ చేపడుతుండగా, సాయంత్రం వేళల్లో అదనపు బృందాలు వారితో కలిసి కూర్చుని ఫారాల పరిశీలన, డిజిటలైజేషన్, ఆన్‌లైన్ అప్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, ఎన్నికల విభాగం అధికారులు, బూత్ లెవల్ అధికారులు (BLOలు) సమన్వయంతో పనిచేస్తున్నందున భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా జూలై 12 నాటికి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోథేటి, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, తిరుపతి ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ శారదా దేవి, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎన్నికల సెల్ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *