-పి.బి. సిద్ధార్థలో ఆస్ట్రాజెనికా సైంటిస్ట్ డా.తాటి రమేశ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జీవశాస్త్రరంగంలో పరిశోధనలతో గతంలో చికిత్సకు లొంగని వ్యాధులకు నూతన మందులు తయారవుతూ మానవాళికి మహోపకారం చేస్తున్నాయని, ఔషధ తయారీరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఆస్ట్రాజెనెకా (స్వీడన్) పరిశోధన విభాగం సీనియర్ శాస్త్రవేత్త డా. తాటి రమేష్ అన్నారు. విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల జీవశాస్త్రాల విభాగాలు శుక్రవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఔషధ ఆవిష్కరణ, నూతన ధోరణులపై కీలకోపన్యాసం చేస్తూ మందుల వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడకుండా జన్యుచికిత్స ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు.
జీవకణాలను, జన్యువులను ఉపయోగించి వ్యాధి నిర్ధారణ, టీకాల అభివృద్ధి, క్యాన్సర్ తరహా ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త మందులు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కరోనా కష్టకాలంలో ఆస్ట్రాజెనికా రూపొందించిన కోవిడ్ టీకా ప్రపంచ దేశాల్లో ఎంతగానో గుర్తింపు పొందిందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్(మస్కట్) ఆచార్యులు, ప్రత్యేక సలహాదారు డా. ఎస్. విజయసారధి ముఖ్య అతిథి డాక్టర్ తాటి రమేశ్ ను సభకు పరిచయం చేశారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, లైఫ్ సైన్సెస్ అధ్యాపకులు డా.పి.శ్రీనివాసరావు, లలితప్రియాంక, రత్నకుమారి ఈ సందర్భంగా డాక్టర్ తాటి రమేష్ ను ఘనంగా సత్కరించారు.
Prajavartha Online Telugu News