విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నా చౌక్ లో బీసీ డిమాండ్లపై మహా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు పెంచాలని దశాబ్దాలుగా బీసీలు పోరాడుతున్న ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు, బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం వలన బీసీలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక రిజర్వేషన్లు అయినా ఎస్సీ, ఎస్టీ బీసీ రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కల్పించినప్పుడు దేశంలో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం చేరుకున్న సందర్భంలో 50 శాతం పరిమితి విధించకపోవడం చాలా అన్యాయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తక్షణమే జోక్యం చేసుకొని ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టేలా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు.మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించకపోతే మహిళా బిల్లు లక్ష్యం నెరవేరదని మహిళా బిల్లు పేరుతో మళ్లీ అగ్రకులాల పాలనే మొదలవుతుందని వారు తెలిపారు, బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును బీసీలు ఒప్పుకోరని వారు హెచ్చరించారు. న్యాయమైన బీసీ డిమాండ్ లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని, అలాగే ఆగస్టు మాసంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ఢిల్లీని కూడా ముట్టడిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసిన శంకర్ రావు లు హెచ్చరించారు. ఈ ధర్నాలో సంఘం ముఖ్య నేత
మేకల వెంకటేశ్వరరావు, మహిళా ఉపాధ్యక్షురాలు జి.శ్వేత, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగుండ్ల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకారావు, రాష్ట్ర ఉద్యోగుల సంఘాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా మహేశ్వరరావు, చిప్పాడ చందు, నాయకులు భాస్కరబాబు, సాయి కిరణ్, మహంతి వాసుదేవరావు, అంగడాల పూర్ణ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News