– ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎంతో మేలు
– విజయవాడ తూర్పులో స్థానిక ప్రజల నుంచి మొత్తం 61 అర్జీలు
– కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మరింత చేరువగా పరిపాలన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్‌రావు అన్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.
శుక్రవారం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని మాచవరంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన్‌లో ప్రత్యేక గ్రీవెన్స్‌తో పాటు ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు సందర్శనలు కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సేవలతో పాటు ప్రభుత్వ పథకాలు, ఉపాధి కల్పన, పోలీసు శాఖ తదితరాలకు సంబంధించి మొత్తం 61 అర్జీలు వచ్చాయి. వీటిని క్షుణ్నంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జులై నెలలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నాలుగు చోట్ల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహణలో భాగంగా గతవారం ఆటోనగర్‌లో కార్యక్రమం జరిగిందని.. అక్కడ స్వీకరించిన అర్జీల్లో కొన్ని ఇప్పటికే పరిష్కారమైనట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం చొరవతో సూపర్ స్ట్రక్చర్ సమస్య నుంచి వందలాది కుటుంబాలకు ఊరట లభించిందన్నారు. అదేవిధంగా మాచవరం జాగీర్దార్ పేరుతో 22ఏలో ఉన్న దాదాపు 80 ఎకరాల భూ సమస్య పరిష్కారానికి కూడా చొరవచూపుతున్నట్లు వెల్లడించారు. ఇది ఓ గొప్ప కార్యక్రమమని.. ప్రజల సమస్యలకు స్థానికంగానే పరిష్కారం లభిస్తున్నందుకు ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఇప్పటికే మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించామని.. ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను నిబద్ధతతో పరిశీలించి సమస్యను నాణ్యంగా అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా కావడంతో పాటు, సమస్యలను స్థానికంగానే త్వరితగతిన పరిష్కరించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజలకు మరింత అందుబాటులో, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్ నోడల్ ఆఫీసర్ జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News