ఆర్టీఐ నిబంధనల అమలులో నిర్లక్ష్యం సహించం

-ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తప్పవు
-రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) లోని సెక్షన్ 4 (1) (బి) నిబంధనలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టం అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఆర్టీఐ చట్టం అమలుపై శుక్రవారం విజయవాడ రూరల్‌లోని గొల్లపూడిలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం, గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కార్యాలయం, బందరు రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయాలను సందర్శించి, ఆర్టీఐ చట్టం అమలు తీరును పరిశిలించి, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆయా కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ఆర్టీఐ రిజిస్టర్లు, రికార్డులు, పౌరులకు అందిస్తున్న సమాచార వ్యవస్థను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన సమాచార కమిషనర్ మాట్లాడుతూ… ఆర్టీఐ చట్టం ప్రభుత్వ ఆపీసుల్లో ఏవిధంగా అమలు అవుతుందో పరిశీలనలో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదంటూ కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (PIOలు), మొదటి అప్పీలేట్ అథారిటీల వివరాలతో కూడిన నేమ్‌ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, జాబ్ చార్టులు, సిటిజన్ చార్టర్లను ప్రదర్శించకపోవడం వంటి లోపాలను రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్ర సమాచార కమిషన్ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా సమాచార కమిషనర్లు ఒక్కొక్కరికి రెండు జిల్లాల చొప్పున బాధ్యతలు అప్పగించి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆర్టీఐ చట్టంపై పూర్తి అవగాహన పెంపొందించడం, చట్టాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయించడమే ఆకస్మిక తనిఖీల ప్రధాన ఉద్దేశం అని ఆయన తెలిపారు. తనిఖీల్లో నిర్లక్ష్యం, విధి నిర్వహణలో లోపాలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ దేవాదాయ శాఖలో ఆర్టీఐ చట్టం అమలు తీరును రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ కు వివరించారు. అలాగే గొల్లపూడి గ్రామ పంచాయతీ, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు అందించిన వివరాలు, రికార్డులను పరిశీలించిన ప్రధాన సమాచార కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ సి. శశిధర్, కార్యదర్శి పట్టంశెట్టి రవి సుభాష్, గొల్లపూడి పంచాయతీ కార్యదర్శి చింతలమ్మ, దేవాదాయ దర్మాదాయ శాఖ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వీవీఎస్‌కే ప్రసాద్, జాయింట్ కమిషనర్ రత్నరాజు, సంబంధిత శాఖల అధికారులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *