– జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ డెంగ్యూ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడ నగరంలోని మాచవరం ప్రాంతంలో జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో కలిసి ఇంటింటి అవగాహన కార్యక్రమం, డెంగ్యూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం తమ ఇళ్లు, పరిసరాలు, వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నిల్వ నీరు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిల్వ నీరు దోమల వ్యాప్తికి ప్రధాన కారణమని, ఎప్పటికప్పుడు నీటి పాత్రలను ఖాళీ చేసి శుభ్రం చేయాలని ప్రజలకు సూచించారు. వ్యాధుల నివారణలో వైద్య ఆరోగ్యశాఖ, మలేరియా సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటే డెంగ్యూ, మలేరియా వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News