ఖరీఫ్‌కు సమృద్ధిగా ఎరువుల నిల్వలు

– బఫర్ స్టాక్‌తో ప్రభుత్వం అప్రమత్తం
– రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరా కొనసాగుతోంది
– రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు : మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులను ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జులై 10వ తేదీ నాటికి 3.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.90 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్‌ఫెడ్ గోదాముల్లో తగిన బఫర్ స్టాక్‌ను నిల్వ ఉంచామని, ఎక్కడైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను తరలించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. చాలా కంపెనీల నుంచి ఎరువుల స్టాక్‌ను వ్యవసాయ శాఖ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గోదాముల్లో భద్రపరుస్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 3,69,646 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఇది ఖరీఫ్‌ అవసరాల్లో 85 శాతం మేరకు సరిపోతుందని మంత్రి తెలిపారు. అలాగే 85,683 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు ఉండగా, ఇది ప్రస్తుత సీజన్ అవసరాల్లో 64 శాతం మేర అందుబాటులో ఉందన్నారు. అవసరానికి అనుగుణంగా నిరంతరం అదనపు ర్యాకులు రాష్ట్రానికి చేరుతున్నాయని, రైతులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు. యూరియా నిల్వల పరంగా అన్ని జిల్లాల్లో అవసరమైన బఫర్ స్టాక్‌ను ఉంచామని, డీఏపీ పంపిణీ కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని తెలిపారు. జిల్లాల వారీగా నిల్వలు, వినియోగాన్ని ప్రతిరోజూ సమీక్షిస్తూ అవసరమైన చోట వెంటనే అదనపు నిల్వలు తరలిస్తున్నామని చెప్పారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఆర్. అముదాలవలస మండలం సంకిలి రైతు సేవా కేంద్రం వద్ద జరిగిన ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. సంకిలి ఆర్‌ఎస్‌కే పరిధిలో 731 ఎకరాల వరి, 90 ఎకరాల ఉద్యాన పంటలు, 80 ఎకరాల చెరకు సాగు పరిధి ఉండగా, ప్రస్తుతం 90 ఎకరాల వరి, 80 ఎకరాల చెరకు మాత్రమే సాగు జరిగిందన్నారు. ఈ ఆర్‌ఎస్‌కే పరిధిలోని సంకిలి, చిన్నయ్యపేట, బొడ్డవలస, అప్పాపురం, ఎం.ఆర్.పేట గ్రామాలకు తొలి దఫా అవసరంగా 811 బస్తాల యూరియా అవసరమని తెలిపారు. ఇప్పటికే బొడ్డవలస, అప్పాపురం గ్రామాలకు 225 బస్తాలు పంపిణీ పూర్తయిందని, మిగిలిన గ్రామాలకు 219 బస్తాల పంపిణీని యూరియా కార్డులు, APAIMS ద్వారా చేపట్టే సమయంలో రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో అదనపు డిమాండ్ ఏర్పడిందన్నారు. అదనంగా వెంటనే 444 బస్తాల యూరియాను సమీప రైతు సేవా కేంద్రం నుంచి తెప్పించి అదే రోజు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి, టోకెన్ విధానం, క్యూలైన్ ఏర్పాటు చేసి పంపిణీని కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 9,987 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు, అందులో మార్క్‌ఫెడ్ వద్ద 4,850 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ అందుబాటులో ఉందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులు అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అవసరమైన ఎరువులను ప్రభుత్వం సమయానికి అందిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *