-స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో శనివారం నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవం (World Population Day) కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భంగా గద్దె రాంమోహన్ మాట్లాడుతూ… గతంలో జనాభా నియంత్రణ కోసం “ఇద్దరు లేదా ముగ్గురు”, అనంతరం “ఒక్కరు లేదా అసలు వద్దు (One or None)” వంటి నినాదాలతో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అమలు చేసి, ఆపరేషన్లకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా కూడా ప్రకటించేవారన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువశక్తి విలువ పెరిగిందని, దేశం మరియు రాష్ట్ర అభివృద్ధికి యువతే ప్రధాన ఆస్తిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ విధానాలు మారుతున్నాయని తెలిపారు.
యువతను మాదకద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచి, వారికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపైనా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని, భవిష్యత్ అవసరాలను ముందుగానే గుర్తించి రాష్ట్రాభివృద్ధికి అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నారని కొనియాడారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి సమష్టిగా కృషి చేయాలని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు.
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతూ… గతంలో జనాభా నియంత్రణే ప్రధాన లక్ష్యంగా ఉండేదని, ప్రస్తుతం తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు, పెరుగుతున్న వృద్ధుల జనాభా వంటి డెమోగ్రాఫిక్ మార్పులు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సవాళ్లుగా మారాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన జనాభా నిర్వహణ విధానం (Population Management Policy) భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన వినూత్న విధానమని అన్నారు.
జనాభా తగ్గుదల వల్ల ఏర్పడే ‘శ్రింకోనామిక్స్’ సవాళ్లను అధిగమించేందుకు యువశక్తిని సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధనలో అమరావతి గ్లోబల్ సిటీ, పారిశ్రామిక కారిడార్లు, కృత్రిమ మేధ (AI), సెమీకండక్టర్ల వంటి రంగాల్లో పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
“పిల్లలే సంపద” అనే భావనతో ప్రతి బిడ్డను భవిష్యత్ సంపద సృష్టికర్తగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జనాభా నిర్వహణ ఫ్రేమ్‌వర్క్‌లోని మాతృత్వ, సంజీవని, శక్తి, క్షేమ, నైపుణ్య అనే ఐదు స్తంభాల ద్వారా ఆరోగ్యవంతమైన, నైపుణ్యం కలిగిన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
వైద్యులు, అధికారులు, విద్యావేత్తలు, విద్యార్థుల భాగస్వామ్యంతో “పిల్లలే సంపద” కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్ది, జనాభా మార్పులను రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అనుకూలంగా మలిచి, వికసిత ఆంధ్రప్రదేశ్ – స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ముందుగానే సాధించాలని సదస్సు పిలుపునిచ్చిందని సురేష్ కుమార్ తెలిపారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సదస్సులో ప్యానెల్ స్పీకర్ల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ డాక్యుమెంటేషన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక, సంస్కృతి సమితి (Andhra Pradesh Creativity and Culture Commission) ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, సిగ్మా రీసెర్చ్ అండ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకులు, సీఈవో డా. ఉలిమిరి వి. సోమయాజులు, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ (కేరళ) చైర్మన్ డా. ఎస్. ఇరుదయ రాజన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, డాక్టర్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News