ధవళేశ్వరం… మరింత పటిష్ఠం

-కొత్తగేట్లు అమర్చే పనుల్ని ఈనెల 13న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-రూ.152.95 కోట్లతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లను బిగించనున్న ప్రభుత్వం
-2014లో రూ.31.77 కోట్లతో 58 గేట్లకు మరమ్మతులు
-ధవళేశ్వరం బ్యారేజ్ రక్షణపై తీవ్ర నిర్లక్ష్యం చూపిన వైసీపీ సర్కార్
-సీడబ్ల్యూసీ సూచనతో గేట్ల మార్పునకు ప్రజా ప్రభుత్వం ముందడుగు
-పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి
-అదే రోజున పోలవరం ప్రాజెక్టు పరిశీలన… అధికారులతో సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడి ధవళేశ్వరం బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. గోదావరి నదిపై నిర్మితమై లక్షలాది ఎకరాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తోన్న ధవళేశ్వరం బ్యారేజీకి ప్రభుత్వం కొత్తగేట్లు అమర్చనుంది. బ్యారేజీకు ఉన్న 117 గేట్లను మార్చాల్సి రావవడంతో వాటి స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గేట్లను అమర్చే పనులకు ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట కొత్తగేట్ల అమరికకు ప్రభుత్వం రూ.152.95 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో పార్ట్-1కు రూ.130.42 కోట్లు, పార్ట్-2కు రూ.22.53 కోట్లు ఖర్చు చేయనుంది. 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనుంది. 12 హెడ్ స్లూయిజ్ గేట్ల బాటమ్ టియర్ షట్టర్లకు మరమ్మతులు చేయనున్నారు. 175 క్రస్ట్ గేట్లకు కొత్త రబ్బరు సీల్స్, 734 రోలర్ బేరింగ్స్ కొత్తవి అమర్చనున్నారు. 197 గేట్లకు వైర్ రోప్స్ మార్పు, సౌండ్ బ్లాస్టింగ్, పెయింటింగ్, పార్ట్-2 కింద 102 మాస్టర్ కంట్రోలర్ ప్యానెల్స్, 175 గేట్లకు ఎలక్ట్రికల్ కేబుల్స్-వైరింగ్ చేయనున్నారు. ఈ పనులను BECOM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టింది. ఈ మొత్తం పనులను BECOM ఇన్ఫ్రా సంస్థ రెండేళ్లలో పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించనుంది.

వైసీపీ ప్రభుత్వం…నిలువెత్తు నిర్లక్ష్యం

సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుల విషయంలో గత ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో ఆ ప్రాజెక్టుల రెండు గేట్లు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అయినా ప్రాజెక్టుల నిర్వహణపై నాటి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించింది. ధవళేశ్వరం ఆనకట్ట విషయానికి వస్తే 2014లో రూ.31.77 కోట్లతో 58 గేట్లకు మరమ్మతులను నాటి టీడీపీ ప్రభుత్వం చేయించింది. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం బ్యారేజ్ రక్షణపై తీవ్ర నిర్లక్ష్యం చూపింది. కనీస మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టలేదు. దీంతో 2024లో ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు రిపేర్లకు గత ఏడాది జూన్ 30న పరిపాలనామోదం ఇచ్చింది. బ్యారేజీ గేట్లను అమర్చి 50 ఏళ్లు దాటడంతో ఆపరేటింగ్ మెకానిజం సర్వీస్ లైఫ్ ముగిసింది. బ్యారేజ్‌ను రెండుసార్లు సందర్శించిన సీడబ్ల్యూసీ… మరమ్ముతులకు సిఫార్సు చేయడంతో ప్రభుత్వ కొత్త గేట్లను అమర్చేందుకు నిర్ణయం తీసుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వివరాలు

ఉదయం 10.25 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు వేమగిరి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. 11.25 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నూతన గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఆత్రేయపురం మండలం పిచ్చుకులంక గ్రామానికి 11.45 గంటలకు చేరుకుని రైతులతో సమావేశమవుతారు. సుమారు గంట పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 05.20 గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శన ముగించుకుని అమరావతికి చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *