-విద్వేషాలు రెచ్చగొట్టే వారి నైజాన్ని చెబుతూనే ఉండాలి
-ప్రభుత్వానికి-పార్టీకి పార్టీ శ్రేణులే వారధి
-టీడీపీ ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోషల్ మీడియాను దుష్ప్రచారం, విద్వేష రాజకీయాలకు వేదికగా మారుస్తూ అశాంతిని రేకెత్తించే గొడ్డలి పార్టీ ప్రయత్నాలను టీడీపీ సహా కూటమి పార్టీల శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, సోషల్ మీడియా వేదికగా గొడ్డలి పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, ఎస్ఐఆర్, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను పార్టీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా వేదికగా గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలు చేయిస్తోందని నేతలు సీఎంకు వివరించారు. దేశాన్ని, హిందూ మతాన్ని కించపరిచిన, మహిళలను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బచ్చలకూరి జోసఫ్ అనే యూ ట్యూబర్‌కు గొడ్డలి పార్టీ అండగా నిలిచిందనే విషయాన్ని సమావేశంలో నేతలు ప్రస్తావించారు. గొడ్డలి పార్టీ నేతలు.. సోషల్ మీడియాను విచ్చలవిడిగా వినియోగిస్తూ… సోషల్ సైకోల్లా వ్యవహరిస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి గొడ్డలి పార్టీ చేసే దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వాస్తవాలను వివరిస్తే గొడ్డలి పార్టీ నేతల నోళ్లకు తాళాలు పడతాయని ముఖ్యమంత్రి అన్నారు. సమాజంలో విధ్వంసాన్ని ప్రేరేపిస్తున్న వారి విషయంలో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని… ఇదే సందర్భంలో ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు.. కార్యకర్తలు తీసుకోవాలని చెప్పారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యంగా పెట్టుకుందనే అంశంపై సమావేశంలో పలువురు నేతలు ప్రస్తావించారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరు చర్చకు వచ్చింది. కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయాలను నిర్మూలించే దిశగా అడుగులు వేస్తుంటే వాటిని మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా అదే స్థాయిలో వ్యవహరించాల్సిన అవసరం లేదని, తప్పుడు ఆరోపణలను ఆధారాలతో ఖండించి వాస్తవాలను ప్రజల ముందుంచితే చాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిజాలంటే గొడ్డలి పార్టీకి భయమని అన్నారు. వాస్తవాలు ప్రజలకు అర్థమైతే… గొడ్డలి పార్టీ సంగతి వాళ్లే చూసుకుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నేతల వ్యవహార శైలి ప్రజలకు తెలిసింది కాబట్టే గడచిన ఎన్నికల్లో వారికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయని సీఎం గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు బనాయించడం, అధికారాన్ని కోల్పోయిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వారిని వెనకేసుకురావడం గొడ్డలి పార్టీకి రాజకీయ సంస్కృతిగా మారిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. గొడ్డలి పార్టీ చేస్తున్న ఇలాంటి చర్యల వల్ల సాధారణ జీవితాలు గడిపే వ్యక్తులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా జైళ్లకు వెళ్లిన ఘటనలను ప్రజలకు గుర్తు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సమాజంలో విద్వేషాలను ప్రోత్సహించే ధోరణిపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఓ పక్కన గొడ్డలి పార్టీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తూనే… ప్రభుత్వం చేసిన మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే పార్టీ శ్రేణుల ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు సమగ్రంగా వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి… అందరికీ సమాన అవకాశాలు
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుటుపల్లి గ్రామాల్లో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న భూ సమస్యలను పరిష్కరించినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 22-ఏ నిబంధనల పేరుతో వివాదాల్లోకి నెట్టిన భూములను దశలవారీగా క్లియర్ చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు ఇరిగేషన్ క్యాలెండర్ అమలు, యురియా సరఫరా కోసం ప్రత్యేక యాప్, అన్నదాత సుఖీభవ నిధుల జమ, ఈ నెలలో తల్లికి వందనం పథకం నిధుల విడుదల వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి… అందరికీ సమాన అవకాశాలు అనే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, స్థానిక అధికారులు, ఉద్యోగులతో పార్టీ యంత్రాంగం సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి స్థాయిలో ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
Prajavartha Online Telugu News