-బుల్డోజర్లు, జేసీబీలు, ప్రొక్లెయిన్ల సంస్కృతికి స్వస్తి పలకాలి
-ఉండవల్లి రైతులపై దౌర్జన్యం దుర్మార్గం
-పంటలు ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలోని ఉండవల్లి గ్రామ రైతుల భూముల్లోకి బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు, జేసీబీలను దింపి, దౌర్జన్యంగా భూములను చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒకవైపు హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా, మరోవైపు రైతుల నుంచి ఎలాంటి అంగీకారం పొందకుండా, పంటలతో కళకళలాడుతున్న భూముల్లోకి బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు, జేసీబీలను దింపి, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి పొలాలను ధ్వంసం చేయడం తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆదివారం ఈశ్వరయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రైతులు పొలాల్లోనే ఉన్నప్పటికీ వారిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించి, తాళ్లతో బంధించి, రెండున్నర ఎకరాలకుపైగా భూమిని దున్నించడం దుర్మార్గం. ఇది పూర్తిగా అప్రజాస్వామిక చర్య. ప్రభుత్వం, సీఆర్డీఏ అధికారులు రైతులతో చర్చలు జరిపి, వారికి చట్టబద్ధంగా రావాల్సిన న్యాయపరమైన పరిహారం చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ, ఆ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా దౌర్జన్యంగా భూములను స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు తార్కాణం. రైతులు తమ చట్టబద్ధమైన అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ, వాటిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా హడావుడిగా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించడం సరికాదు. ఉండవల్లి ప్రాంతంలో జొన్నచేను, అరటి తదితర పంటలు సాగులో ఉండగానే బుల్డోజర్లతో వాటిని ధ్వంసం చేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోవడం విచారకరం. హైకోర్టులో కేసు తుది విచారణ పూర్తికాకముందే, ప్రభుత్వం కౌంటర్ కూడా దాఖలు చేయకుండానే బుల్డోజర్లను దింపడానికి కారణమేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ముందస్తుగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. అవార్డు కాపీలు అందించలేదు. ఏ భూమికి ఎంత ధర నిర్ణయించారనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుపలేదు. ఉండవల్లి రైతులు కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, పని దినాల్లో కాకుండా వ్యూహాత్మకంగా శని, ఆదివారాలను ఎంచుకుని బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవడాన్ని తప్పు పడుతున్నాం. మహిళలతో సహా రైతులను నిర్బంధించి, చేతికొచ్చిన పంటను నాశనం చేస్తూ బుల్డోజర్లతో వెంటనే రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించడం అన్యాయం.
2014-19 కాలంలోనే ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక గ్రామాల రైతులు తమవి మూడు పంటలు పండే జరీ భూములని, వాటిని భూ సమీకరణకు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించినప్పటికీ, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో రైతులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ విపక్ష పార్టీల నాయకులకు వినతిపత్రాలు సమర్పించారు. విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉండటంతో పాటు, రాజధాని ప్రాంత ప్రారంభ భాగంలో ఉన్న ఉండవల్లిలో ప్రస్తుతం ఎకరా భూమి మార్కెట్ విలువ రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పైగానే ఉంది. సీఎం చంద్రబాబు నివసిస్తున్న కరకట్ట నివాసానికి కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న ఉండవల్లి రైతుల భూములకు ఎకరా విలువను రూ.1.18 కోట్లుగా లెక్కగట్టి, 2 ఎకరాలకు రూ.2.62 కోట్ల పరిహారం మాత్రమే నిర్ణయించి, ఆగమేఘాల మీద దౌర్జన్యంగా భూములను స్వాధీనం చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం. టీడీపీ నాయకులు, వారి బినామీలు భూములను కొనుగోలు చేసే సమయంలో మార్కెట్ విలువను ఒకరకంగా, రైతుల నుంచి భూములు స్వాధీనం చేసుకునే సమయంలో మార్కెట్ విలువను మరో రకంగా అమలు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం.
రైతుల నుంచి కనీసం బ్యాంకు ఖాతా వివరాలు కూడా సేకరించకముందే, వారి పేర్లతో చెక్కులు ఎలా సిద్ధమయ్యాయో ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. హైకోర్టులో కేసు తుది విచారణ పూర్తయ్యే వరకు ఉండవల్లి రైతుల భూములపై కొనసాగుతున్న అన్ని బలవంతపు చర్యలను తక్షణమే నిలిపివేయాలని, రైతుల భూముల్లోకి అధికారులు ప్రవేశించకుండా చూడాలని, పంటలను ధ్వంసం చేయించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి, రాజధాని పేరుతో చేపడుతున్న బలవంతపు భూ సేకరణను, రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఈశ్వరయ్య డిమాండ్ చేస్తున్నాం.
Prajavartha Online Telugu News