కేబినెట్ ఉప సంఘానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక సూచనలు

-ఈ నెలాఖరులోగా ప్రత్యేక న్యాయస్థానం పని ప్రారంభించాలి
-సీఐడీతో డెడికేటెడ్ బృందం వెనువెంటనే నియమించాలి
-యాజమాన్యపు బినామీ ఆస్తులు అన్నింటినీ అటాచ్‌మెంట్ చేయాలి
-కంపెనీ భూములను చిన్న కమతాలుగా చేసి బహిరంగ వేలం వేయాలి
-2015కి ముందు రిజిష్ట్రర్డ్ స్థలాలు బాధితులు, కొనుగోలుదారులకు అందించాలి
-ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీవీ చంద్రశేఖర్ విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత మార్చి 6వ తేదీన నిరవధిక దీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక కోర్టు, మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయడం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ మాట్లాడుతూ మంత్రివర్గ ఉప సంఘం ఇటీవల సమావేశ అనంతరం ఆరు నెలల్లో బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తామని మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌లు మీడియా ముందు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యానికి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. అన్ని రకాల కోర్టు లిటిగేషన్లను ఉపసంహరించుకోవాలని, కుటుంబ సభ్యుల పేర, బీనామీల పేర దాచిన ఆస్తులు అన్నింటినీ ప్రభుత్వానికి స్వాధీనపరచి, ఇప్పటికైనా బాధితులకు చేసిన ద్రోహపు చర్యల నుండి బయట పడాలని ముప్పాళ్ళ సూచించారు. 2015కి ముందు కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలు, ప్లాట్ల హక్కు దారులందరూ, తమ రిజిష్ట్రేషన్ స్టాంప్ జెరాక్స్, ఆథార్ కార్డు జెరాక్స్, ఫోన్ నంబరుతో సహా ఆయా జిల్లాల అసోసియేషన్ కార్యాలయాల్లో ఈనెల 25వ తేదీలోగా వాటిని అందించాలని కోరారు. వాటన్నింటినీ సీఐడీ హెడ్ క్వార్టర్స్‌కు చేర్చుతామని తెలియజేశారు. సీఆర్ స్లిప్పులు ఉన్న వారు, కస్టమర్లకు డబ్బు చెల్లించి బాండ్లు, రశీదులు ఉన్న వారు 30 రోజుల్లోగా సీఐడీ వారికి అందించాలని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొన్నదని, నియోజకవర్గాల వారీగా వాటిని వెంటనే సమీకరించి సీఐడీ హెడ్ క్వార్టర్స్‌లో అందించేలా జిల్లా, నియోజకవర్గ అసోసియేషన్ బాధ్యులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈ నెలాఖరులోగా పని ప్రారంభించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ముప్పాళ్ళ విజ్ఞప్తి చేశారు. కాýయాపన జరగకుండా ఆస్తులు పారదర్శకంగా మార్కెట్లో ఉన్న వాస్తవ రేటు లభించేలా చేయాలంటే, యుద్ధ ప్రాతిపదికన సీఐడీకి డెడికేటెడ్ బృందాన్ని నియమించాలని కోరారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీ భూములను రెండు, ఐదు ఎకరాల చొప్పున చిన్న చిన్న కమతాలుగా విభజించి తగినంత సమయం ఇచ్చి, ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి, బహిరంగ వేలం పెడితే వేగంగా అమ్ముడు పోతాయని సూచించారు. ఇళ్ల స్థలాలకు అనువైన భూములన్నిటినీ ప్లాట్లుగా వేయించి, ఉడా తరహాగా లాంటి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి విక్రయిస్తే ఎక్కువ రాబడి వస్తుందని తెలిపారు. ఈ స్థలాల విక్రయాల్లో అగ్రిగోల్డ్ ఏజెంట్లు కూడా పూర్తి సహకారం అందజేస్తారని చెప్పారు.
బీవీ చంద్రశేఖర్ మాట్లాడుతూ మంత్రివర్గ ఉప సంఘం ఆహ్వానించిన రోజు అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం మరిన్ని వివరాలతో కూడిన సూచనలను అందజేస్తామని చెప్పారు. అగ్రిగోల్ద్ యాజమాన్యం వద్ద ఉన్న ఏజెంట్ల, కస్టమర్ల పూర్తి సమాచారాన్ని తెప్పించుకోవాలని మంత్రివర్గ ఉప సంఘానికి సూచించారు. 12 సంవత్సరాలుగా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సారథ్యంలో నిరంతరాయంగా అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన చరిత్రాత్మకమైన పోరాటాలు నిర్వహించామని అన్నారు. చంద్రబాబు గత ప్రభుత్వం హయాంలో 776కి పైగా సీఐడీ వారి ద్వారా కౌంటర్లు ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు, డిపాజిటర్ల బాండ్లను కంప్యూటీకరణ చేయడంతో ఆత్మహత్యలు నివారించడానికి బాగా తోడ్పడిందని గుర్తుచేశారు. కంపెనీ అగ్రిగోల్డ్ బాధితులను ఎన్నో రకాలుగా మోసగించి, ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో, ఇబ్బందులున్న బాధితులు, కస్టమర్లు అందరి నుంచి అర్జీలు స్వీకరించడానికి మండల తహసీల్దార్, పోలీస్ అధికారి, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి ఒకరితో కలిపి ముగ్గురు చొప్పున కమిటీలు వేస్తే, వారం రోజుల్లో బాధితులు అర్జీలు సమర్పించేందుకు వీలవుతుందని తెలిపారు. వాటన్నిటిని సమీక్షించి పరిష్కరించడం ద్వారా నూరు శాతం బాధితులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ షరీఫ్, పి.భాస్కర్‌రావు, శాంతి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *