విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, బీఎన్‌ఐ, బి.ఆర్. కాన్సెప్ట్స్ సంయుక్త నిర్వహణలో విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం మెగా ఉద్యోగ మేళా ఘనంగా జరిగింది. విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహనరావు, ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ సభ్యుడు మాదిగాని గురునాధం జ్యోతి ప్రకాశనం చేసి జాబ్ మేళా ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఉద్యోగ మేళా నిర్వాహకులకు, పాల్గొన్న విద్యార్థులకు అభినందనల సందేశం పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించి లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. గురునాధం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ఈ ఉద్యోగ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర అర్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల యువతకు పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు బి.ఎన్.ఐ. సంస్థ పక్షాన జె. హెచ్. దేశాయ్, ఆచంటి మేఘన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్. మధుభూషణరావు, జిల్లా నైపుణ్య శిక్షణాధికారి ఎన్.ఎస్.శ్రీనివాసరావు, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఉపాధి అధికారి కావూరి శ్రీధర్, శిరీష గాంధీ, మాజీ కార్పొరేటర్ ఉషారాణి, గద్దె క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News