చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు

-పెడనలో ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల మహోత్సవం సందర్భంగా.. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కృష్ణా జిల్లా కలెక్టర్ చొరవతో పెడన నియోజకవర్గంలోని పెడన పట్టణంలో సోమవారం వారికి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో, చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు.

పెడన పట్టణంలోని మూడు ప్రధాన ప్రాంతాల్లో ఈ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీరభద్రపురంలోని వినాయకుని ఆలయం వద్ద, మఠం వీధిలోని అయ్యగారి మఠం వద్ద, బ్రహ్మపురంలోని మఠం గుడి వద్ద ఈ శిబిరాలు నిర్వహించారు.

శిబిరాల్లో చేనేత, కలంకారీ కార్మికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఉచితంగా కంటి పరీక్షలు, రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్) పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. నిరంతరం మగ్గాలపై, రంగులతో పనిచేసే చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఈ సందర్భంగా పెడన శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ..చేనేత, కలంకారీ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇటువంటి వైద్య శిబిరాలు కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చేనేత వృత్తిలో నిరంతరం మగ్గాలపై పనిచేయడం వల్ల కంటి సమస్యలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల సంబంధిత ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాల మేరకు చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పెడన పట్టణంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించిన ఈ శిబిరాల్లో కంటి, ఎముకలు-కీళ్ల (ఆర్థోపెడిక్), రక్తపోటు, మధుమేహం తదితర ఆరోగ్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గూడూరు మండలంలోని గ్రామాల్లో కూడా ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించి చేనేత కార్మికులతో పాటు ప్రజలందరికీ ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తామని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) వంటి పథకాల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని తెలిపారు. పెడన నియోజకవర్గంలో గత రెండేళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.6 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించామని, ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ ఎస్. సతీష్ కుమార్, మచిలీపట్నం చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు సి.హెచ్. విజయ్ బాబు, అభివృద్ధి అధికారి బి. రాజశేఖర్, సహాయ అభివృద్ధి అధికారి బి. లోకేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *