-ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రతి వినతిని నిర్ణీత గడువులో పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆయన జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇంచార్జి డిఆర్ఓ పి పోతురాజు, కేఆర్ఆర్సి ఎస్డిసి పి నీలకంఠేశ్వర రెడ్డి, చిలకలపూడి సిఐ ఎస్కే అబ్దుల్ నబీతో కలసి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించే విధానం, వాటిని ఆన్లైన్లో సమర్పించే ప్రక్రియపై జిల్లా కలెక్టర్ అధికారులకు వివరించారు. అర్జీలను సరైన రీతిలో ఎండార్స్మెంట్ చేయకుండా పదే పదే తప్పులు చేస్తున్నారని, దీనివల్ల అర్జీలు రీఓపెన్ అవుతున్నాయని, ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.
ఒక వ్యక్తికి చెందిన అర్జీను పూర్తిగా పరిష్కరిస్తేనే ఆన్లైన్ పోర్టల్ లో సిటిజన్ బెనిఫిటెడ్ అనే ఆప్షన్ ను ఎంచుకొని సమర్పించాలని, అలా కాకుండా అర్జీదారుని పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే గనక సిటిజెన్ యెట్ టు బి బెనిఫిటెడ్ అనే ఆప్షన్ను ఎంచుకొని సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అర్జీలలో కొన్ని:
* బాపులపాడు మండలం రామన్నగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొన్నేళ్లుగా అవకతవకలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పనికి రాని వ్యక్తులకు హాజరు నమోదు చేసి, వారి వేతనాల్లో వాటా తీసుకుంటున్నారని చెప్పారు. అలాగే అర్హులైన తమకు పని కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ, సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్‌పై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
* మచిలీపట్నం మండలం గోకవరం పంచాయతీ ఓడరేవుపాలెంకు చెందిన చిట్టిప్రోలు రమా సత్యవతి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తన ఇద్దరు కుమార్తెలు పుట్టుకతోనే వికలాంగులని, పెద్ద కుమార్తె (36) ఇప్పటికీ మంచానికే పరిమితమై ఉందని తెలిపారు. వారి సంరక్షణ కారణంగా తాను ఉపాధికి వెళ్లలేకపోతున్నానని, భర్త కూలి పనులతోనే కుటుంబం నడుస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెద్ద కుమార్తెకు అందుతున్న రూ.6 వేల పింఛన్‌ను రూ.15 వేలకు మార్పు చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
కార్యక్రమంలో జెడ్పీ సీఈవో డాక్టర్ జే అరుణ, ఆర్ అండ్ బి ఈఈ లోకేశ్వరావు, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, మత్స్య శాఖ అధికారి అయ్యా నాగరాజా, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, వ్యవసాయ ఉద్యాన శాఖల అధికారులు జ్యోతి రమణి, జే జ్యోతి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, సర్వే ఏడి లక్ష్మణరావు, ఎన్టీఆర్ వైద్యసేవ డిసి సతీష్, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News