-అమరావతి ఛాంపియన్షిప్ పోస్టర్ ఆవిష్కరణ
-పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం
-12 క్రీడాంశాల్లో అండర్ – 17 & అండర్ – 23 విభాగాలలో నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు
-ఆగష్టు 29 న నేషనల్ స్పోర్ట్స్ డే రోజు రూ. 94 లక్షలను నగదు రూపంలో విజేతలకు బహుమతులు అందచేస్తాం
-మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే ప్రధాన లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0 పోస్టర్‌ను ఈరోజు శాప్ కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి ఐ. ఎఫ్. ఎస్., అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, డబల్ ఒలంపియన్ రజనీ తో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గత ఏడాది అమరావతి ఛాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది అమరావతి ఛాంపియన్‌షిప్–2026 జూలై 15 నుంచి ప్రారంభమవుతుందని, అనుభవజ్ఞులైన కోచ్‌లు, క్రీడా నిపుణుల సూచనలతో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
అలాగే గతంలో అండర్-22 విభాగంలో పోటీలు నిర్వహించగా, ఈసారి అండర్-17 మరియు అండర్-23 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాలతో పాటు విశ్వవిద్యాలయ స్థాయి క్రీడాకారులకు అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జూలై 15 నుంచి 24 వరకు 175 నియోజకవర్గాల్లో ప్రాథమిక ఎంపికలు, ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లా స్థాయి పోటీలు, ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు.
ఈ ఛాంపియన్‌షిప్‌లో బాస్కెట్‌బాల్, కబడ్డీ, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్‌తో పాటు మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం రూ.94 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈసారి మూడు లక్షల మంది క్రీడాకారులు పాల్గొనాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తీర్చిదిద్దుతాయని, ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో పాల్గొనాలని సూచించారు.
అమరావతి ఛాంపియన్‌షిప్‌ను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తారని, ఆగస్టు 29న జరిగే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన DSDOలు, కోచ్‌లను ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులను ముందుగానే ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, కామన్వెల్త్ మరియు ఆసియా క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు శిక్షణ కోసం సుమారు రూ.2.5 కోట్ల ప్రోత్సాహక నిధులు అందించిందని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యతను చాటిచెప్పిన ‘పెద్ది’ సినిమా హీరో రామ్ చరణ్‌తో పాటు చిత్ర బృందానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
శాప్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి ఐ. ఎఫ్. ఎస్. మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్‌షిప్ 2.0లో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి, యువ క్రీడాకారుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉన్న విద్యార్థులకు తమ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశమని చెప్పారు. కొత్త క్రీడాకారులతో పాటు గత విజేతలు కూడా పాల్గొనే ఈ టోర్నమెంట్ రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ముందుగానే నిధులు కేటాయించడం ద్వారా క్రీడాకారులకు పూర్తి ప్రోత్సాహం అందిస్తోందని, రానున్న నెలన్నర రోజుల పాటు జరిగే ఈ క్రీడా మహోత్సవంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
శాప్ బోర్డు సభ్యులు మరియు అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజిని గారు మరియు చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మాట్లాడుతూ, అమరావతి ఛాంపియన్‌షిప్ విద్యార్థులకు ఎంతో విలువైన వేదిక అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. అమరావతి ఛాంపియన్‌షిప్ ద్వారా యువ క్రీడాకారులకు మరో గొప్ప అవకాశం లభిస్తోందన్నారు. నేటి పరిస్థితుల్లో పిల్లలకు శారీరక, మానసిక దృఢత్వం అత్యంత అవసరమని, అందుకు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యమని సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి, జీవితంలోని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనే గుణాన్ని క్రీడలు నేర్పుతాయని అన్నారు. ఫలితం ఎలా ఉన్నా పోరాడే తత్వాన్ని పిల్లలు అలవరచుకోవాలని, తల్లిదండ్రులు కూడా వారిని క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో శాప్ ఏవో రామవత్ వెంకట రమణ నాయక్, అంతర్జాతీయ క్రీడాకారులు మరియు శాప్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News