-ఆటోనగర్‌లో పేరుకుపోయిన చెత్తని 10 రోజుల్లో తొలగించండి
-అధికారులకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఏఎల్ఏ (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) పరిధి ఆటో నగర్ ప్రాంతంలో ‘చెత్త సేకరణ, బదిలీ కేంద్రం’ (గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్) ఏర్పాటుకు అనువైన ఖాళీ స్థలాన్ని గుర్తించాలని ఏపీఐఐసీ, ఐఏఎల్ఏ అధికారులను స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన సమగ్ర లేఅవుట్ ప్లాన్, ఇంజనీరింగ్ డిజైన్, అంచనా వ్యయం, ఇతర ప్రాజెక్ట్ పత్రాల తయారీకి సాంకేతిక సహాయం కోరుతూ ఏపీఐఐసీ సంస్థ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌కు ప్రతిపాదన పంపాలని చెప్పారు. విజయవాడ ఆటోనగర్ లోని ఏపీఐఐసీ జోనల్ కార్యాలయంలో మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణపై సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటోనగర్ లో పేరుకుపోయిన చెత్త తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని చైర్మన్ పట్టాభిరామ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రతిపాదిత గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ తాత్కాలిక సేకరణ, చెత్త వేర్వేరుగా విభజించే కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడ సేకరించిన చెత్తను కాంపాక్టర్ల ద్వారా జిందాల్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు తరలించి శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలిస్తారు. ఈ అత్యాధునిక బదిలీ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన లేఅవుట్, ప్రణాళిక, డిజైన్, సాంకేతిక అంశాల రూపకల్పనలో సహాయపడేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ ఇంజనీరింగ్ బృందాన్ని పంపిస్తుందని చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు.
ప్రధానంగా ఈ సమావేశంలో మున్సిపల్ ఘన వ్యర్థాల సమర్థవంత నిర్వహణ, చెత్త పారవేత, చుట్టుపక్కల పట్టణ స్థానిక సంస్థలు, ఐఏఎల్ఏ ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల రవాణా సౌకర్యం తదితర అంశాలను సమీక్షించారు. పరిసర ప్రాంతాలలోని స్థానిక సంస్థల ద్వారా ఉత్పత్తి అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాల (solid waste) రోజువారీ పరిమాణం, ఆటో నగర్ వద్ద పేరుకుపోయిన చెత్తకు సంబంధించిన వివరాలను చైర్మన్ పట్టాభిరామ్ ఐఏఎల్ఏ కమిషనర్ని అడిగి తెలుసుకున్నారు. ఆటో నగర్ పరిధిలో ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్గత చెత్త సేకరణ విధానం గురించి ఐఏఎల్ఏ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు.
తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్, తమ మున్సిపల్ పరిధిలో రోజుకు సుమారు 110 మెట్రిక్ టన్నుల (ఎంటీ) చెత్త ఉత్పత్తి అవుతోందని తెలిపారు. గుంటూరులోని జిందాల్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ మెయింట్ నెన్స్ నిమిత్తం తాత్కాలికంగా మూసివేసినందున మున్సిపల్ ఘన వ్యర్థాల తరలింపు నిలిచిపోయి, దాదాపు 2,000 మెట్రిక్ టన్నుల చెత్త ఆటోనగర్ లో పేరుకుపోయిందని తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ తెలిపారు. కాంపాక్టర్ నిర్వహణ బృందం ఇన్ఛార్జ్ రామ్మోహన్, తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్లు పేరుకుపోయిన చెత్త తొలగింపునకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని చైర్మన్ పట్టాభిరామ్ ఆదేశించారు. అలాగే, అవసరమైన సిబ్బంది, యంత్రాలు, రవాణా ఏర్పాట్లను సమకూర్చుకుని, పేరుకుపోయిన చెత్తను పది రోజులలోపు, అంటే ఈ నెల 23 లోపు పూర్తిగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అద్దెకు తీసుకున్న టిప్పర్ వాహనాల ద్వారా చెత్త సేకరణ జరుగుతోందని ఐఏఎల్ఏ కమిషనర్ చైర్మన్ పట్టాభిరామ్ కు తెలిపారు. వీధి వీధిలో దుకాణాల వెంట తిరిగి చెత్త సేకరించే సాధారణ టిప్పర్ కార్యకలాపాలకు బదులుగా, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ‘ఎలక్ట్రిక్ వాహనాలను’ వినియోగించవచ్చని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ సూచించారు. సర్వీస్ మోడల్ లో అనుభవం కలిగిన ఏజన్సీల నుంచి వాహనాలను తీసుకుని అద్దె చెల్లించవచ్చని, తద్వారా మున్సిపల్ ఘన వ్యర్థాల సేకరణ సమర్థవంతంగా జరుగుతుందన్నారు.
ఆటోనగర్ ఐఏఎల్ఏ కమిషనర్ బాబ్జీ, తమ పరిధిలో రోజుకు సుమారు 15 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని చైర్మన్ పట్టాభిరామ్ కు తెలిపారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్), సంబంధిత నిర్వహణ ప్రాంతంలో రోజుకు సుమారు 130 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందన్నారు.
ఈ సమావేశంలో ఏపీఐఐసీ సీజీఎం ఐఎల్ రామ్, ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ చైర్మన్ సుంకర దుర్గా ప్రసాద్, జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ బాబ్జీ, డిప్యూటీ జోనల్ మేనేజర్లు ఎం.దొరబాబు, జి.జ్యోతి, ఫైనాన్స్ మేనేజర్ జి.బాలమ్మ, మేనేజర్(ఇంజనీరింగ్) ఎండీ ఇస్మాయిల్ బేగ్, విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఏఎంహెచ్ఓ గోపాల నాయక్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, శానిటరీ ఇనస్పెక్టర్ సుధాకర్, కాంపాక్టర్ మెయింట్ నెన్స్ టీమ్ ఇన్ చార్జి నూతక్కి రామమోహన్, ఆటోనగర్ ఐఏఎల్ఏ మాజీ అధ్యక్షులు ఎస్.దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News