– నిందితులను కాపాడేందుకు అమాయక యువకుడిని బలిపశువుని చేశారు
– శ్రీకాకుళం ప్రమాద ఘటనలో నిజాలను వక్రీకరించే ప్రయత్నం జరిగింది
– అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి
– ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలను కప్పిపుచ్చేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నం జరిగిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గొడ్డలి పార్టీ నాయకులు సాక్ష్యాలను తారుమారు చేసి.. నిజాలను కప్పిపుచ్చడంలో సిద్ధహస్తులు అని అన్నారు. 2019లో జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, గొడ్డలి పోటుతో జరిగిన హత్యను గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూమారుడు అరవ్.. బీసీ కులానికి చెందిన వ్యక్తిని ఢీ కొట్టి చంపేశాడు. శ్రీకాకుళంలో జరిగిన ప్రమాద ఘటనలో వాస్తవాలను దాచిపెట్టి, బాధ్యులను తప్పించే ప్రయత్నం జరిగిందని అన్నారు. ప్రమాదం ఎవరికైనా జరగవచ్చని, ప్రమాదం జరగడాన్ని తాను తప్పుబట్టడం లేదని స్పష్టం చేసిన ఆయన, ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించడం ప్రతి వ్యక్తి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. అయితే కాశీబుగ్గ ఘటనలో ఆ బాధ్యతను నిర్వర్తించకుండా, ప్రమాదానికి కారణమైన వ్యక్తిని తప్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా, మరో యువకుడిని రంగంలోకి దించి కథనాన్ని మార్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ మోటార్‌సైకిల్ నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడని, సీసీ టీవీ పుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుందని బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. అయితే నిందితుడిని తప్పించే క్రమంలో సిద్ధార్థ్ అనే బ్రాహ్మణ యువకుడిని తీసుకొచ్చి, అతడే వాహనం నడిపాడని చెప్పే విధంగా కథ తయారు చేశారని అన్నారు. గొడ్డలి పార్టీకి వాస్తవాలను వక్రీకరించడం కొత్త కాదని, ఈ ఘటనలో కూడా అదే పద్ధతిని అనుసరించారని విమర్శించారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి బీసీ వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందినవారని పేర్కొన్న ఆయన, కుటుంబ పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఇద్దరు చిన్నపిల్లలు, మతిస్థిమితం లేని భార్యను వదిలి ఆ కుటుంబ పెద్ద మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితిలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యతను విస్మరించి, నిందితుడిని రక్షించడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తిపైనే కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుని ఉంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని, అయితే అలా చేయకుండా అమాయక యువకుడిని కేసులో ఇరికించడం దురదృష్టకరమన్నారు. బీసీ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, బ్రాహ్మణ యువకుడిని బలిపశువుగా మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీనివల్ల ఒక కుటుంబం మాత్రమే కాదు, మరో యువకుడి భవిష్యత్తును కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. గుంటూరు జిల్లాలో జగన్ రెడ్డి పర్యటన సందర్భంగా దళిత యువకుడు సింగయ్య వాహనం కింద పడి మరణించిన ఘటనను కూడా బుచ్చి రాంప్రసాద్ ప్రస్తావించారు. ఆ సమయంలో కూడా బాధితుడిని పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆరోపిస్తూ, గొడ్డలి పార్టీ నాయకుల వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు లేదని విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే సొంతవారిని కాపాడుకోవడమే వారికి ముఖ్యమని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చట్టపరంగా పని చేస్తోందని, చట్టం ముందు హోదాలు, వ్యక్తులు, రాజకీయాలు కాదని, నేరమే ప్రధానమని బుచ్చి రాంప్రసాద్ పేర్కొన్నారు. నేరం చేసిన వ్యక్తి ఎవరైనా సరే చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కేసులో కీలకమైన సీసీటీవీ ఆధారాలు ఇప్పటికే లభించాయని ఆయన తెలిపారు. పెట్రోల్ బంక్ వద్ద తీసిన సీసీటీవీ దృశ్యాల్లో అరవ్ కనిపించాడని, ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న కెమెరాల్లో కూడా అతడే వాహనం నడుపుతున్నట్లు నమోదైందని ఆరోపించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలు కూడా దర్యాప్తుకు కీలక ఆధారాలుగా ఉన్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించకుండా, అరవ్‌ను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం జరిగిందని, అనంతరం సిద్ధార్థ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అతడే ప్రమాదానికి కారణమని చెప్పి కేసు నమోదు చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అయితే సీసీటీవీ దృశ్యాల్లో సిద్ధార్థ్ ఎక్కడా కనిపించకపోయినా, అతడిపై కేసు నమోదు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత తొలి 20 నిమిషాలు అత్యంత కీలకమైన “గోల్డెన్ పీరియడ్” అని, ఆ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 108 అంబులెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రమాద సమాచారం అందిన 15 నిమిషాల్లోపు అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకోవాలని నిబంధనలు అమలు చేస్తోందన్నారు. అలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్న శ్రీకాకుళం పట్టణంలోనే ప్రమాదం జరిగినప్పటికీ, బాధితుడికి తక్షణ వైద్యం అందకుండా విలువైన సమయాన్ని నిందితుడిని కాపాడేందుకు వినియోగించారని ఆరోపించారు. గొడ్డలి పార్టీ అవసరానికి అనుగుణంగా వివిధ వర్గాలను ఉపయోగించుకుంటుందని బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. బీసీలను పట్టించుకోరని, బ్రాహ్మణ యువకులను బలిపశువులుగా మారుస్తారని, అవసరమైతే ఎస్సీలు, ఎస్టీలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ధోరణిలోనే ముందుకు సాగుతారని ఆరోపించారు. అందువల్ల అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రాహ్మణ సమాజాన్ని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడుతూ, అమాయక యువకుల జీవితాలను రాజకీయ ప్రయోజనాల కోసం నాశనం చేసే కుట్రలకు బలికావద్దని కోరారు. ఈ కేసులో తప్పు చేసిన వ్యక్తి వేరైతే, శిక్ష మాత్రం సిద్ధార్థ్ అనే బ్రాహ్మణ యువకుడు అనుభవించే పరిస్థితి తీసుకురావడం అన్యాయమని అన్నారు. ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా నిజాలను వెలికితీసి బాధ్యులను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం ప్రమాద ఘటనలో నేరుగా ప్రమాదానికి బాధ్యులైన వారిపైనే కాకుండా, నిందితులను తప్పించే ప్రయత్నం చేసిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుచ్చి రాంప్రసాద్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించి బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
Prajavartha Online Telugu News