చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్

-ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం
-రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ జారవిడిచే ప్రక్రియ
-అడవులు క్షీణించిన ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణకు చర్యలు
-వర్షాకాలం, భూ అనుకూలతల ఆధారంగా కార్యక్రమ విస్తరణ
-పర్యావరణహిత, దేశవాళీ వృక్ష జాతుల అభివృద్ధికి పవన్ కళ్యాణ్  ప్రణాళికలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవం రోజున ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ప్రారంభించిన సీడ్ బాల్స్ తయారీ, వెదజల్లే కార్యక్రమం కొనసాగుతోంది. గత నెలలో ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను చేపట్టిన అటవీశాఖ, ఆ లక్ష్యాన్ని మించి 3.80 కోట్ల సీడ్ బాల్స్ ను ప్రజల భాగస్వామ్యంతో రూపొదించింది. వర్షాకాల అనుకూల పరిస్థితులు ఉన్న అటవీ ప్రాంతాల్లో వెదజల్లే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సాయంతో వెదజల్లే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. రాష్ట్రంలో డ్రోన్ సాంకేతికతతో విత్తన బంతులు జారవిడిచే పక్రియ చేపట్టడం ఇదే తొలిసారి. మనుషులు ప్రవేశించలేని దట్టమైన అడవుల్లో వృక్ష సంపద క్షీణించిన ప్రాంతాన్ని గుర్తించి పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారు.
చింతూరు అటవీ రేంజ్ పరిధిలో మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో ఇప్పటి వరకు 2.71 లక్షల సీడ్ బాల్స్ మానవ వనరుల సహాయంతో వెదజల్లారు. మిగిలిన సీడ్ బాల్స్ ని మారుమూల, ఎవరూ చేరుకోలేని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ సాంకేతికతతో జారవిడుస్తున్నారు. చింతూరు అటవీ ప్రాంత పరిధిలో క్షీణించిన 440.50 హెక్టార్ల అటవీ ప్రాంతాలను గుర్తించి, పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వర్షాకాల అనుకూల పరిస్థితుల ఆధారంగా కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు విస్తరించనున్నారు. అవకాశం ఉన్న చోట మానవ వనరుల సాయంతో, లేని చోట డ్రోన్ ఆధారిత సేవలు అమలు చేస్తున్నారు.
జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ, వితరణ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనూకూల, దేశీయ జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో తక్షణం వెదజల్లే పక్రియ ప్రారంభించాలని సూచించారు. వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని తదితర వృక్ష జాతుల విత్తనాలు సోమవారం డ్రోన్ ద్వారా వెదజల్లిన వాటిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఉపముఖ్యమంత్రివర్యుల నిర్దేశిత సూచనలకు అనుగుణంగా అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *