విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తమ జీవనోపాధి దెబ్బతీసేలా తీసుకువచ్చిన జీవో 396ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ చేశారు. అనేక మంది డాక్యుమెంట్ రైటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, క్యాంప్ వెండర్లు, అనుబంధ సిబ్బంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేష్రన్ల శాఖలో పీపీపీ విధానం ద్వారా సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 396ను వెంటనే రద్దు చేయాలని ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖల వృత్తి పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ గాంధీనగర్ లో జరిగిన సమావేశంలో సమితి అధ్యక్షుడు పైలా సతీష్, మాట్లాడుతూ… ఈ కొత్త విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షమందికి పైగా దస్తావేజు లేఖర్లు, సహాయకులు, స్టాంపు వెండర్లు మరియు డీటీపీ ఆపరేటర్లు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 100 ఏళ్లకు పైబడి సేవ చేస్తున్న తమ వృత్తిని దెబ్బతీసేలా ప్రైవేటు కేంద్రాలకు బాధ్యతలు అప్పగించడం దారుణమని ఆయన విమర్శించారు. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం విజయవాడ అధ్యక్షులు చింతకాల నాగసత్య మూర్తి మాట్లాడుతూ… కేవలం కంప్యూటర్ పరిజ్ఞానంతో దస్తావేజులు తయారు చేయడం ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ జీవోను ఉపసంహరించే వరకు ఈ నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 11 రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. 2001 నుంచి నిలిపివేసిన లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని, అర్హులైన వారందరికీ కొత్త లైసెన్సులు మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సీతపల్లి శేషు కుమార్, సీనియర్ దస్తావేజు లేఖరు దర్భ శ్రీనివాస్, మద్దినేని చక్రధర్, పి.సూర్యనారాయణ, చొప్పర రాము, వృత్తుల వెంకటేశ్వర్లు, ఎస్ హనుమంతరావు, సిహెచ్. శ్రీకృష్ణ, నాయుడు బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News