విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. సంఘం నూతన అధ్యక్షుడిగా కొత్త ముక్తేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వక్కలగడ్డ పవన్ కుమార్, కోశాధికారిగా కొత్త గణేష్ బాబు, యువ జన సంఘం విభాగం అధ్యక్షుడిగా పాలకుర్తి మోహిత్, మహిళా దళ్ విభాగం అధ్యక్షురాలిగా గర్రె ధనలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కేవలం ఆర్భాటాల కోసమే ప్రమాణ స్వీకారాలు చేయడం కాకుండా ప్రజలకు, సమాజానికి ఎన్నో మంచిపనులు చేసి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు అత్యంత ప్రాధాన్యత లభించిం దన్నారు. ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుకు రాకేష్ దంపతులు ఎంతో కష్టపడ్డారని మంత్రి ప్రశంసించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ సేవకు మారుపేరు ఆర్యవైశ్యులు అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలోనే ఆర్యవైశ్యులకు సముచిత స్థానం లభించిందని, ఆర్యవైశ్యులకు కీలక పదవులు అప్పగించారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని, టీడీపీ ద్వారానే ఆర్యవైశ్యులకు సమాజంలో తగిన గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ముక్తేశ్వరరావు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పర్యటించి ఆర్యవైశ్యుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో గల ఆర్యవైశ్య సామాజికవర్గం మొత్తాన్ని ఏక తాటిపై తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. ఆర్యవైశ్యుల్లో పేదవారిని గుర్తించి వారి విద్య, వైద్య అవసరాలకు చేయూత ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య, పెనుగొండ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News