Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో అదుపు తప్పిన శాంతి భద్రతలు… : ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, పోలీసుల వేధింపులు, లాకప్ మరణాలు, మహిళలపై అఘాయిత్యాలు, దళితులపై దాడులు, రాజకీయ హింస పెరుగుతున్నాయని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో వాయిదా తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇటీవల పోలీసుల వేధింపులతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన సాయి కృష్ణ, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు లాకప్‌లో మృతి చెందిన ఘటనలతో పాటు, కర్నూలుకు చెందిన మాల గంగమ్మ, కృష్ణా జిల్లాకు చెందిన క్రాంతి కుమార్, పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుస్సేన్‌లు పోలీసుల వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయని వాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఈ ఘటనలు పోలీసుల జవాబుదారీతనం, పౌరుల ప్రాణ, ఆస్తి భద్రతపై తీవ్ర సందేహాలను కలిగిస్తున్నాయని అన్నారు. విపక్ష సభ్యుల నినాదాలతో పలుమార్లు సభ వాయిదా పడటంతో వాయిదా తీర్మానం చర్చకు రాలేదని ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.

జూన్ 2024 నుంచి మార్చి 2026 వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి మొత్తం 209 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు, 12 అత్యాచార యత్నాలు, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 భౌతిక దాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలు, వేధింపుల కారణంగా 15 ఆత్మహత్యలు లేదా ఆత్మహత్యాయత్నాలు చోటుచేసుకున్నాయని వివరించారు. దళితులపై 69 ఘటనలు నమోదయ్యాయని, వీటిలో హత్యలు, లాకప్ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేతలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో రాజకీయ హింసకు సంబంధించిన 133 ఘటనలు నమోదయ్యాయని, వాటిలో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 అపహరణలు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంసం ఘటనలు, రాజకీయ వేధింపుల కారణంగా జరిగినట్లు ఆరోపణలు ఉన్న 4 ఆత్మహత్యలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల పనితీరుపై 12 సందర్భాల్లో ప్రతికూల వ్యాఖ్యలు చేసినట్లు, రాష్ట్రంలో శాంతిభద్రతలకు సంబంధించిన 79 ప్రధాన ఘటనలు నమోదైనట్లు తెలిపారు.

ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో పాలనా వైఫల్యాన్ని, శాంతిభద్రతల క్షీణతను స్పష్టంగా సూచిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరాలని, అన్ని ఘటనలపై నిష్పాక్షికంగా, నిర్ణీత గడువులో విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల రాజ్యాంగ హక్కులు, ప్రాణ, ఆస్తి భద్రతను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్‌సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *