-ప్రజాసేవకు అంకితమై డివిజన్ల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల ఆశీస్సులతో నూతనంగా ఎన్నికైన మేయర్ వంగవీటి రాధాకృష్ణతో పాటు కూటమి కార్పొరేటర్లందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరూ ప్రజాసేవను బాధ్యతగా స్వీకరించి తమ తమ డివిజన్ల పరిధిలోని స్థానిక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతాయుతంగా పనిచేసి విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి కోరారు.
