-పోలింగ్ సామగ్రి పంపిణీ పూర్తి – రేపు ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌కు ఏర్పాట్లు
-వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, బుడమేరు ప్రవాహ పరిస్థితులపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
-పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాం
-జి.కొండూరు మండలంలో 16 సెగ్మెంట్లు, 60 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు
-ఎన్నికల సిబ్బంది రవాణాకు 5 ప్రత్యేక రూట్లు, ప్రతి రూట్‌కు రెండు బస్సులు
-పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా పూర్తి
-బుడమేరులో తగ్గిన నీటి ప్రవాహం – డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
-ప్రస్తుతానికి ఎలాంటి వరద ముప్పు లేదు – ప్రజలు ఆందోళన చెందవద్దు
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
విజయవాడ/జి.కొండూరు/గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, పోలింగ్ సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడ, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించి, ఒకవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను, మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
పర్యటనలో భాగంగా జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించి, పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జి.కొండూరు మండలంలో మొత్తం 16 సెగ్మెంట్లు, 60 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఎన్నికల సామగ్రి తరలింపు, పోలింగ్ సిబ్బంది రవాణా కోసం ఐదు ప్రత్యేక రూట్లను ఏర్పాటు చేశామని, ప్రతి రూట్‌కు రెండు బస్సుల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. రవాణా ఏర్పాట్లలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం పోలింగ్ నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన బాధ్యతలను అత్యంత జాగ్రత్తగా, అప్రమత్తంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల నియమావళిని పూర్తిస్థాయిలో పాటిస్తూ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులకు అందుతున్న సౌకర్యాల పరిశీలన
భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ దేవినగర్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సహాయక చర్యలు కొనసాగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు.
* బుడమేరు ప్రవాహంపై డ్రోన్లతో పర్యవేక్షణ
అనంతరం జి.కొండూరు మండల పరిధిలోని వెలగపూడి హెడ్ రెగ్యులేటర్, హెచ్. ముత్యాలంపాడు బ్రిడ్జి, గంపలగూడెం మండల పరిధిలోని కట్టలేరు బ్రిడ్జి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బుడమేరు రెగ్యులేటర్ వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను అధికారులు డ్రోన్ కెమెరాల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గత రోజుతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం నీటి ప్రవాహ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఎలాంటి వరద ముప్పు లేదని స్పష్టం చేశారు. బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, నీటి ప్రవాహంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో వచ్చే నిర్ధారణలేని సమాచారాన్ని, వదంతులను నమ్మవద్దని సూచించారు. అధికారిక సమాచారం మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, పరిస్థితులపై జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఎన్నికల నిర్వహణ, ప్రజల భద్రత రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ పర్యటనలో జి కొండూరు తహసిల్దార్ డి.రిబ్కారాణి, బుడమేరు ఇరిగేషన్ డీఈఈలతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
