గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రీన్ గుంటూరు కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కచ్చితంగా కాపాడాలని, త్వరలో వీటిపై ఆడిట్ కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సీ.ఎం. సాయి కాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్లో నోటీసులు అందజేసిన వారికి నిర్దేశిత గడువులో హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హియరింగ్‌కు సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహిస్తూ ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు సన్నద్ధతపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్ల గుర్తింపు కార్యక్రమం నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించి, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాలో కార్డులు లేని యానాది కుటుంబాలను గుర్తించి వారికి ఆధార్ కార్డులు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అందేలా అవసరమైన గుర్తింపు పత్రాలను సమకూర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గ్రీన్ గుంటూరు కార్యక్రమం పురోగతిని సమీక్షిస్తూ, పచ్చదనం పెంపు, మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వీబీజీ రామ్‌జీ తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డిఆర్ఓ ఖాజావలి, ఇతర అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News