-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
-చేనేతలపై ఆర్థిక భారం పడకూడదన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-అర్హులందరికీ నేతన్నల సేవలో అందించండి
-10 రోజుల్లోగా కొత్త లబ్దిదారులను ఎంపిక చేయండి
-వీలైనంత వేగంగా రెండో విడత ఆర్థిక సాయం అందజేయాలి
-6న పెనుకొండలో ఆప్కో షో రూమ్ ఏర్పాటు
-స్వయం ఉపాధి యూనిట్లపై అవగాహన సదస్సులు నిర్వహించండి : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేతలకు ఆర్థిక మేలు కలిగించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని, ఇందులో భాగంగా పెట్టుబడిగా నూలు అందజేయనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దీనివల్ల నేతన్నలపై పెట్టుబడి భారం పడుకుండా ఉంటుందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పది రోజుల్లోగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆర్థిక సాయం అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల్లో చేనేత ఉత్పత్తులు, హస్త కళారూపాల అమ్మకాలు పెంచాలని, రానున్న పండగల నేపథ్యంలో డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై గ్రామ స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం చేనేత, జౌళి శాఖ, గ్రామీణ ఖాదీ బోర్డు అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వివరించారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేత, హస్త కళకారులు గౌరవ ప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారన్నారు. చేనేతలకు ఆర్థిక మేలు కలుగజేసేలా ఇప్పటికే పలు పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేసేలా నేతన్నల సేవలో పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం అమలులో భాగంగా తొలి విడతగా 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. అర్హులైన మరింత మందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించగా, 36,632 మంది అప్లయ్ చేసుకున్నారన్నారు. రాబోయే పది రోజుల్లో వారిలో అర్హులను గుర్తించి, వీలైనంత తొందరగా రెండో విడత నేతన్నల సేవలో పథకం ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలని చేనేత, జౌళి శాఖాధికారులను ఆదేశించారు.
పెట్టుబడిగా నూలు సరఫరా
చేనేత వస్త్రాల తయారీలో ముఖ్యమైన నూలును పెట్టుబడిగా రుణ రూపేణా సరఫరా చేయాలని మంత్రి సవిత ఆదేశించారు. నేతన్నలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేసిన తరవాత ఆప్కో అధికారులు సరఫరా చేసిన నూలు మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన చెల్లింపులు చేయాలన్నారు. ముందుగా నూలు అందజేయడం వల్ల నేతన్నలపై పెట్టుబడి భారం తగ్గుందని మంత్రి సవిత తెలిపారు.
6న పెనుకొండలో ఆప్కో షో రూమ్ ప్రారంభం
ఆప్కో, లేపాక్షి షో రూమల్లో చేనేత ఉత్పత్తులు, హస్త కళారూపాల విక్రయాలు పెంచాలని మంత్రి సవిత ఆదేశించారు. చేనేతలు, హస్త కళాకారులకు 365 రోజులూ ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో అవసరమైన చోట ఆప్కో, లేపాక్షి షో రూమ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల ఆరో తేదీన పెనుకొండలో ఆప్కో షో రూమ్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో కూడా ఆప్కో, లేపాక్షి షో రూమ్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న పండగల నేపథ్యంలో చేనేత, హస్త కళలపై డిస్కౌంట్ సేల్స్ ప్రారంభించాలని మంత్రి సవిత తెలిపారు.
ఉపాధి యూనిట్లపై అవగాహన సదస్సులు
ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయిదేళ్లలో రాష్ట్రంలోని 20 లక్షల మంది యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో తెలిపిందన్నారు. ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు ద్వారా అందజేసే స్వయం ఉపాధి యూనిట్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, ఖాదీ గ్రామీణా పారిశ్రామిభివృద్ది బోర్డు సీఈవో సింహాచలం, లేపాక్షి ఎండీ విశ్వ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News