Breaking News

గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ టోర్నీ…

-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ సీఎం కప్ టోర్నీ కృష్ణాజిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోటే రత్నదాస్ కలిశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రత్నదాస్ మాట్లాడుతూ 30 ఏళ్ళ లోపు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం కప్ 2021-22 టోర్నీ నిర్వహిస్తోందన్నారు. మండల స్థాయిల్లో టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ పూర్తయ్యాయని, ప్రస్తుతం కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల్లో పలు క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. గెల్చిన, ఓడిన జట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులతో జిల్లాస్థాయి జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 20 వ తేదీ తర్వాత గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు 16 పురుషుల, 16 మహిళల జట్లు విచ్చేస్తున్నాయన్నారు. ఈ పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చే క్రీడాకారులతో రాష్ట్రస్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను కూడా గుడివాడ పట్టణంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డితో పాటు పలువురు క్రీడా ప్రముఖులు విచ్చేస్తున్నారని తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ దేశంలో ఎంతో ప్రతిభ కల్గిన క్రీడాకారులు ఉన్నారని చెప్పారు. అటువంటి క్రీడాకారులను గుర్తించి వారికి సరైన శిక్షణ అందిస్తే దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదుగుతారని తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) దసరా నుండి ఉగాది వరకు సీఎం కప్ టోర్నీ పేరుతో క్రీడా సంబరాలను నిర్వహిస్తోందన్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో 13 క్రీడాంశాల్లో ఓపెన్ మీట్ జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న 175 నియోజకవర్గాల నుండి క్రీడాకారులు పోటీ పడుతున్నారన్నారు. నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన జట్లకు మళ్ళీ పోటీలను నిర్వహించి జిల్లాస్థాయిలో బహుమతులను అందజేస్తారన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ప్రతిభ గల క్రీడాకారులతో జిల్లా జట్లను ఎంపిక చేస్తారన్నారు. గుడివాడ పట్టణంలో ఎంతో ముందు చూపుతో ఎన్టీఆర్ స్టేడియాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. గుడివాడ పట్టణ, పరిసర ప్రాంతాల నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చుతున్నారని కొనియాడారు. అలాగే వివిధ స్థాయిల్లో క్రీడా పోటీల నిర్వహణకు ఎన్టీఆర్ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. ఏపీ సీఎం కప్ టోర్నీ పేరుతో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ తదితర క్రీడల్లో క్రీడాకారులంతా అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాణించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నేత పాలడుగు రాంప్రసాద్, నందివాడ ఎంపీపీ పెయ్యల ఆదాం, గుడ్లవల్లేరు మాజీ ఎంపీపీ కోగంటి ధనుంజయ, వైసీపీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, వైసీపీ నేత కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి

-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *