-సక్రమంగా రీసైక్లింగ్ చేస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాలు
-మారిస్ స్టెల్లా కళాశాలలో APPCB ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈ-వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేస్తే విలువైన వనరులుగా మార్చుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య అన్నారు.
బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా APPCB విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో ఈ-వ్యర్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ఈ-వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ ఆవశ్యకతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న APPCB ఛైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య మాట్లాడుతూ, ఈ-వ్యర్థాలను ఇతర వ్యర్థాల నుంచి వేరు చేసి, ప్రత్యేకంగా సేకరించి అధీకృత రీసైక్లర్లకు మాత్రమే అందజేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు సైతం ఈ విషయంలో చైతన్యవంతులై సమాజంలో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
APPCB పర్యావరణ ఇంజనీర్ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ఈ-వ్యర్థాల ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు సమర్థవంతమైన సేకరణ, వర్గీకరణ, శాస్త్రీయ నిర్వహణ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
APPCB జూనియర్ రీసెర్చ్ ఫెలో ఎం.డి. ఫాతిమా షహనాజ్ మాట్లాడుతూ, ఈ-వ్యర్థాల్లో 50 శాతానికి పైగా లోహాలు, ఆర్థిక విలువ కలిగిన మూలకాలు ఉంటాయని వివరించారు. వాటిని శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి వినియోగంలోకి తీసుకురావచ్చని, తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు విలువైన వనరులను ఆదా చేయవచ్చని పేర్కొన్నారు.
APPCB అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ-వ్యర్థాల నిర్వహణ రంగంలో యువతకు అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ రంగంలో నూతన వ్యాపార ఆలోచనలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మారిస్ స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇనాసమ్మ గాడే, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఎస్. ఆశా, విభాగాధిపతి డాక్టర్ ఎస్. వాణి లత, వృక్షశాస్త్ర విభాగాధిపతి టి. కిరణ్మణి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా APPCB, మారిస్ స్టెల్లా కళాశాల సంయుక్తంగా ఈ-వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వద్ద ఉన్న ఈ-వ్యర్థాలను అందజేశారు. సేకరించిన వ్యర్థాలను తదుపరి అధీకృత రీసైక్లర్లకు అప్పగించనున్నారు. అదేవిధంగా నిర్వహించిన క్విజ్, చిత్రలేఖన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు APPCB తరఫున పర్యావరణహిత బాటిళ్లు, సంచులను బహుమతులుగా అందజేశారు.
ఈ కార్యక్రమం ద్వారా ఈ-వ్యర్థాల సక్రమ నిర్వహణ, విలువైన వనరుల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించారు.
