MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు

-నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
-19,885 మంది పోలీసులతో మూడు అంచెల భద్రత
-సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలు, డ్రోన్లు, బాడీ వోర్న్ కెమెరాలతో నిఘా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MPTC, ZPTC రెండవ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు 07.11.2026న ఉదయం 8.00 గంటలకు ప్రారంభం కానుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 365 లెక్కింపు కేంద్రాల్లో సుమారు 9,062 లెక్కింపు బల్లలపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఇందుకోసం 11,002 మంది లెక్కింపు పర్యవేక్షకులు, 28,692 మంది లెక్కింపు సహాయకులు, ఇతర సిబ్బందిని నియమించారని ఎన్నికల కమిషనర్ పునేఠా తెలిపారు.

ఈ ఎన్నికల్లో 77 ZPTCలు, 2,051 MPTCలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 577 ZPTCలు, 7,707 MPTCలకు 05.11.2026న పోలింగ్ నిర్వహించారని, మొత్తం పోలింగ్ శాతం 70.72గా నమోదైందని ఆయన తెలిపారు. గత 2021 ఎన్నికల పోలింగ్ శాతం 60.91తో పోలిస్తే 9.81 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించారు.

బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ పెట్టెల ధ్వంసం వంటి ఘటనల నేపథ్యంలో అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో 06.11.2026న రీపోలింగ్ నిర్వహించేందుకు ఆదేశించామని ఈ మేరకు ఆయా జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా ముగిసిందని తెలిపారు.

ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం బ్యాలెట్ పెట్టెల్లోని MPTC, ZPTC బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారని తెలిపారు. మొత్తం లెక్కింపు బల్లల్లో 50 శాతం ZPTCలకు, మిగిలిన 50 శాతం MPTCలకు కేటాయించారని, ప్రతి బల్లకు ఒక్కో రౌండ్‌లో 1,000 బ్యాలెట్ పత్రాలను లెక్కింపు కోసం అందజేస్తారని ఆయన పేర్కొన్నారు.

లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పటిష్టమైన పోలీసు భద్రత, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశామని, ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా అన్ని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసిమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు…..

రాష్ట్ర పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నవంబర్ 5వ తేదీన నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రేపు జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఐజీ బి. రాజకుమారి వెల్లడించారు.

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో 19,885 మంది పోలీసు సిబ్బందితో మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బందోబస్తు విధుల్లో భాగంగా…..

• డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు – 135 మంది

• ఇన్‌స్పెక్టర్లు – 572 మంది

• సబ్‌ఇన్‌స్పెక్టర్లు – 1,412 మంది

• అడిషనల్ సబ్‌ఇన్‌స్పెక్టర్ల నుంచి పోలీసు కానిస్టేబుళ్ల వరకు – 14,877 మంది

• హోమ్ గార్డ్ లు – 2889 మంది

మొత్తం 19,885 మంది పోలీసులతో కౌంటింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఐజీ తెలిపారు.

అదేవిధంగా సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్‌తో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీ వోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఐజీ బి. రాజకుమారి కోరారు.