పొలం గట్లపైనా, పంట బోదెల మీద సీఎం

-రైతు కష్టం తెలిసిన నాయకుడిగా..ప్రతి అడుగులో భరోసా
-తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
-అటు సమీక్షలు.. ఇటు పర్యటనలతో గట్టెక్కిస్తున్న సీఎం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
సచివాలయంలో సమీక్షలే కాదు పొలం గట్లపైకి, పంట బోదెల మీద తిరుగుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను నష్టాన్ని స్వయంగా చూసి తెలుసుకున్నారు. రైతన్న కష్టానికి కదిలి.. పొలం గట్లపైకి ముఖ్యమంత్రి వెళ్లారు. తుఫాను వల్ల నష్ట పోయిన అన్నదాతకు అండగా నిలిచేలా రాత్రిళ్లు సైతం సమీక్షలు నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించారు. తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగిన రైతుల కష్టాన్ని కళ్లారా చూసేందుకు ధ్వంసమైన రహదారుల్లోనూ, ముంపు ప్రాంతాల్లోనూ పర్యటించారు. అక్టోబరు 27 తేదీ నుంచి నిరంతరాయంగా ప్రజల్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ.. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాల్ని తెలుసుకుంటూ ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలిచారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా పర్యవేక్షణతో పాటు నేల కొరిగిన చెట్లను తక్షణమే తొలగించేలా యంత్రాంగాన్ని నడిపించి సంక్షోభ నివారణలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. నెలల తరబడి కష్టపడి, అప్పులు చేసి, ఆశలతో సాగు చేసిన పంట నష్ట పోతే అన్నదాతకు ఎంత కష్టమో రైతుకే తెలుసు. అలాంటి కష్ట కాలంలో రైతుకు ధైర్యం చెప్పేందుకు, వారి కన్నీళ్లు తుడిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పొలం గట్లపైకి నడిచారు. నీట మునిగిన చేల మధ్యకు వెళ్లారు. పంట బోదెల వద్ద నిలబడి పంట నష్టాన్ని పరిశీలించారు. రైతుల పక్కన నిలబడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

తుఫాను నష్టం ఎక్కడుంటే.. అక్కడికి సీఎం

అర్నబ్ తుఫాను సమయంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం వరకు ముఖ్యమంత్రి పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. తాజాగా మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించారు. బాపట్ల జిల్లాలోని జిల్లెళ్లమూడి, గుంటూరు జిల్లాలోని రేటూరులో నీట మునిగిన వరి పొలాల వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పొలం గట్లపై నడుస్తూ, పంట బోదెలను చూస్తూ రైతుల ఆవేదనను ఆలకించారు. అధికారుల నివేదికలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. పంట నష్టాన్ని చూసి రైతులు పడుతున్న ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట దెబ్బతింది.. ఎంత నష్టం వాటిల్లింది. రైతులకు తక్షణం అందించాల్సిన సాయం తదితర అంశాలను వారినే అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పండించిన పంటను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తు రైతును కుంగదీయకుండా, తిరిగి వ్యవసాయం చేసుకునేలా సహకారం అందించాలన్న దిశగా అధికారులకు సూచనలు చేశారు.

రైతులు, ప్రజల కోసం రాత్రి పగలు అప్రమత్తం

తుఫాను తీరం దాటిన తర్వాతే కాదు.. ముప్పు పొంచి ఉందని తెలిసినప్పటి నుంచే ముఖ్యమంత్రి అప్రమత్తమయ్యారు. అక్టోబరు 27 నుంచే ఆర్నబ్ తుఫాను ప్రభావంపై వరుస సమీక్షలు నిర్వహించారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేయించి, అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. మురసు తుఫాను సమయంలోనూ రాత్రిళ్లు సైతం మేల్కొని టెలి కాన్ఫరెన్సుల ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. వాతావరణ పరిస్థితులు, వర్షాల తీవ్రత, ముంపు ప్రాంతాలు, ప్రజల తరలింపు, సహాయక చర్యలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారు. విపత్తు సమయంలో రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతోనూ నిరంతరం సంప్రదింపులు జరిపారు. నష్ట తీవ్రతను అంచనా వేయడం, బాధితులకు సాయం అందించడం, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు. ఒకవైపు ఉన్నతాధికారులతో సమీక్షలు..మరో వైపు క్షేత్రస్థాయి పర్యటనలు.. ఇంకోవైపు ప్రజలను అప్రమత్తం చేస్తూ విపత్తు నిర్వహణను సమన్వయంతో ముఖ్యమంత్రి ముందుకు అడుగు వేశారు.