బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని తక్షణమే పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు మరియు నార్ల ఆడిటోరియం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్ విస్తరణ పనుల పురోగతిని పరిశీలించి, పనుల జాప్యంపై అధికారులపై ఆసహనం వ్యక్తం చేశారు. కీలకమైన ప్రధాన రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉంటే ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతాయని, పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ ఒకేసారి సమాంతరంగా చేపట్టి వేగవంతం చేయాలని ఆదేశించారు. విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఆక్రమణలను ఎలాంటి తాత్సారం లేకుండా తక్షణం తొలగించాలని, అలాగే రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యు) పరిధిని మీరి రోడ్డుపైకి ముందుకు నిర్మించిన కట్టడాలను వెంటనే తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు, పనులకు ఆటంకం కలిగించేలా బిల్డింగ్ మెటీరియల్ ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై ఉండటానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగించి క్లియర్‌గా ఉన్న పోర్షన్లలో వెంటనే డ్రెయిన్ నిర్మాణ పనులను ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. పట్టాభిపురం మెయిన్ రోడ్ లో నిర్మాణ సామాగ్రి రోడ్ మీదకు వేసి, నిర్మాణం చేస్తున్న భవన నిర్మాణ అనుమతులు రద్దు చేసి, నిర్మాణం ఆపాలని, మెటీరియల్ ని సీజ్ చేయాలని టిపిఎస్ ని ఆదేశించారు.
అనంతరం నార్ల ఆడిటోరియం నిర్మాణ మరియు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకొని, ఆడిటోరియం పనులను మరింత వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నమయ్య ట్రస్ట్ ప్రతినిధులకు సూచించారు.
పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణు వర్ధన్, ఏసిపీ రెహ్మాన్, డిఈఈ వెంకట రమణ, ఏడీహెచ్ శాంతి, ఎస్ఎస్ సోమశేఖర్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.