డిసెంబర్ నెలాఖరుకు అభివృద్ధి పనులన్నీ నూరు శాతం పూర్తి కావడమే లక్ష్యం

-ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలి
-నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయకపోయినా, నాణ్యతలో లోపాలు కనిపించినా ఉపేక్షించే ప్రసక్తే లేదు
-విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు, పనుల్లో నాణ్యత లోపం ఉంటే కాంట్రాక్టర్లను తక్షణమే బ్లాక్ లిస్ట్‌లోకి
-అధికారులు, కాంట్రాక్టర్లతో ప్రాజెక్ట్స్ పై జరిగిన సమీక్షలో కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగర రూపురేఖలను మార్చే కీలకమైన అభివృద్ధి పనులన్నింటినీ డిసెంబర్ నెలాఖరు నాటికి నూటికి నూరు శాతం పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫెరెన్స్ హాల్లో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో ప్రాజెక్ట్స్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్, తొలుత ప్రాజెక్ట్ ల వారీగా అధికారులు, కాంట్రక్టర్లతో వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ నగర అభివృద్ధిలో అత్యంత కీలకమైన జంక్షన్ల అభివృద్ధి, థీమ్ పార్కులు మరియు నైబర్ హుడ్ పార్కుల అభివృద్ధి, సెంట్రల్ డివైడర్లలో పచ్చదనాన్ని పెంపొందించే పనులు, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు, ఎన్టీఆర్ స్టేడియం అభివృద్ధి పనులపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులన్నీ గుంటూరు నగర ప్రతిష్టకు సంబంధించినవని గుర్తు చేస్తూ, ప్రతి ఒక్కరూ నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని తేల్చి చెప్పారు. జంక్షన్ల అభివృద్ధి పనులు జరిగే సమయంలో ఏఈలు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయాలని, అవసరమైతే డిజైన్ చేసిన కన్సల్టెన్సీ వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తి చేయడంలో విఫలమైనా లేదా నాణ్యతలో లోపాలున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని హెచ్చరించారు. ఎక్కడైనా టెండర్ పొంది పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారికి కూడా నోటీసులు ఇచ్చి, పనులను రద్దు చేసి, వారిని కూడా బ్లాక్ లిస్టు లో పెట్టాలని ఎస్ఈని ఆదేశించారు.
సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, డిసిపీ సూరజ్ కుమార్, ఈఈలు సుందర్రామిరెడ్డి, విష్ణు వర్ధన్, వేణు గోపాల్, డిఈఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.